ఎల్‌నినో వేళ ఢిల్లీ పర్యటనలా?

24-10-2026 | 05:35am
  1. అఖిలపక్ష సమావేశం పెట్టాలి
  2. కేంద్రాన్ని సహాయం కోరితే పరిశీలిస్తుంది
  3. మేం ఓట్ చోరీ చేసి ఉంటే రేవంత్ ఎలా గెలిచారు? 
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్ నినోతో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలు చేయడం బాధ్యతారాహిత్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు(BJP State President N Ramchander Rao) అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజలు,  రైతులు తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థి తుల్లో ఢిల్లీ పర్యటనలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఎల్ నినోపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్రం సహాయం కోరుతూ నివేదిక పంపిస్తే దాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో రాంచందర్ రావు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

‘లాంచింగ్.. లాంచింగ్.. కానీ, ల్యాండింగ్ లేదు. అలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ రాంచందర్‌రావు విమర్శించారు.  ‘నెక్స్ పీఎం రాహుల్ అని రేవంత్ రెడ్డి పదే పదే అనకుంటే ఆయనకు సీఎం కుర్చీ ఉండదు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు సాగు నీరు, కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని.. హైదరాబాద్‌లోనూ నీటి సమస్యలు, విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో సమస్యలు ఉండగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టడం బాధ్యతారాహిత్యమని, గతంలోనూ మంత్రులందరినీ స్పెషల్ ఫ్లుటైలో ఢిల్లీకి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. నల్లగొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిపై క్షేత్రస్థాయి పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన వారిని అరెస్టు చేయడం అమానుషమన్నారు. ‘కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రభావిత ప్రాంతాలను ఇంతవరకు పరిశీలించలేదు.

హైదరాబాద్‌లో ట్యాంకర్ నీటి బుకింగ్స్ పెరుగుతున్నాయి. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పవర్ సరఫరా, సోలార్, బొగ్గు లభ్యత వంటి మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎల్ నినో పేరుతో మీటింగ్ పెట్టి అందులో గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చించడం ఏమిటని ప్రశ్నించారు. బొగ్గు సరఫరాపై రాజకీయ ఆరోపణలు చేయడం కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు. రైతుల కష్టాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని, వాళ్లు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని అన్నారు. 

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతాం..

‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని, దాన్ని తిప్పికొడతామని రాంచందర్‌రావు తెలిపారు. ఓటు తొలగింపుపై ఫిర్యాదులకు నిర్దిష్ట ప్రక్రియ ఉందని, ఆధారాలతో ముందుకు రావాలన్నారు. ఓటు తొలగించిన వారి పేర్లను తీసుకురావాలంటూ గతంలోనే తాను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసిరానని ఆయన చెప్పారు. ఓటు తొలగింపుపై నిజమైన కేసులు ఉంటే ప్రతిపక్షాలు వివరాలు చూపాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి కౌంటర్‌గా లోక్‌తంత్ర బచావ్ నినాదంతో బీజేపీ కార్యక్రమాలు చేపడుతున్నది. నవంబర్ 1న హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట సహా ఐదు కేంద్రాల్లో వేలాది మందితో పాదయాత్రలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.

ఫ్రాన్స్ తరహాలోనే ఢిల్లీలో పార్లమెంట్ లక్ష్యంగా ఆందోళనకు యత్నించారని, ఈ క్రమంలోనే నిరసన వేదిక జంతర్‌మంతర్ నుంచి వేరో చోటికి మారిందని చెప్పారు. తిరంగా ర్యాలీ చేయడం తప్పు కాదని.. దేశానికి, జాతీయ సమైక్యతకు వ్యతిరేకంగా వాళ్లు చేసిన స్లోగన్సే తప్పు అని పేర్కొన్నారు. తాము ఓట్ చోరీ చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. కాగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు అంశంపై ఢిల్లీ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని రాంచందర్‌రావు తెలిపారు. టికెట్ విషయంలో పీఆర్టీయూ టీఎస్ సంఘం తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు