గ్యాస్ లీకై ఇద్దరు కార్మికుల మృతి
మరో ఆరుగురికి అస్వస్థత
గడ్డపోతారం సరాక పరిశ్రమలో ఘటన
పటాన్‌చెరు/జిన్నారం, అక్టోబర్ 23: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సరాక లాబోరేటరీ(Saraca Laboratory) పరిశ్రమలోని గ్లాబా బ్లాక్‌లో ప్రాణాంతక గ్యాస్ లీకయ్యింది. నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్న కార్మికుల్లో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు.
లీకైన విషవాయువు పీల్చడం వల్ల ఊపిరాడక కార్మికులు సుదర్శన్ రావు (27), బాలాజీ (44) చనిపోయారు. వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెంది న వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీ ఘటన, కార్మికుల మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హుటాహుటిన సరాక ఫ్యాక్టరీకి వెళ్లారు. పరిస్థితిని పర్యవేక్షించారు.
కర్మాగారాల్లో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ.70 లక్షల పరిహారం ఇవ్వాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.లక్ష ఇవ్వాలని కోరారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అం దించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై నిరంతర తనిఖీలు జరిపి, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏదీ : హరీశ్‌రావు
గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందడం విషాదకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృ తుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తన ఎక్స్ ఖాతాలో డిమాండ్ చేశారు.
పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్ర మాదం జరగడం దురదృష్టమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటుందని విమ ర్శించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఎప్పుడు తీసుకుం టారని నిలదీశారు. సరాక పరిశ్రమ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిగాచి ఘటనలో ఇంటి పెద్దను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.