వచ్చేది గడ్డుకాలమే!

24-10-2026 | 05:55am
  1. ఎండాకాలం పంటలకు నీళ్లు అసాధ్యం
  2. 8 నెలలు ఎల్ నినోతో తీవ్ర పరిస్థితులు
  3. ప్రజాప్రతినిధులు గ్రామాల బాటపట్టాలి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఎల్ నినో వల్ల 8 నెలలపాటు ప్రమాదకర పరిస్థితులు ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. ‘వచ్చేది గడ్డుకాలమే. ఇది క్యాన్సర్ లాంటి నిజం. ప్రజలకు ముందే చెప్పడం మంచిదని చెబుతున్నాం. వచ్చే నాలుగు నెలలు సాగు కు చుక్క నీరూ దొరకదు. తాగడానికే నీళ్లు కష్టమయ్యే పరిస్థితి ఉంది.. అలాంటిది ఎండాకాలం పంటలకు నీళ్లు ఇవ్వడం అసాధ్యం’ అని పేర్కొన్నారు.

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్కర పరిస్థితేనని, మరో 8 నెలల పాటు ఎండలు తీవ్రం గా ఉంటాయన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఎల్ నినో ప్రభావం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్.. తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కరువును ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించామన్నారు. 

ప్రజల భాగస్వామ్యం ఉంటేనే..!

కరువు, విపత్తులను మనం నిలువరించలేమని, కరువుపై 6 నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ‘అక్టోబర్‌లో మొదలైన కరువు జులై వరకు ఉంటుంది. ఎండ వేడి పెరుగుతుంది.. నీటి ఆవిరి పెరుగుతుంది.. నీటి సమస్య వస్తుంది. వచ్చే నాలుగు నెలలు సాగుకు చుక్కనీరు కూడా దొరకదు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కరువును ఎదుర్కోలేం. 8 నుంచి 10 నెలలపాటు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం జరగదు. ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేయాలి. పశుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని ఆయన అప్రమత్తం చేశారు. 

హరీశ్‌ను నమ్మి పంటలు వేయొద్దు..

‘ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని రాజకీయ దురుద్దేశంతో బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశంలోని మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని 100 దేశాలపై ఎల్ నినో ప్రభావం ఉంది. మహారాష్ట్ర లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలోనూ నీటి ఎద్దడి ఉంది.

ఆ రాష్ట్రంలో 20శాతం తక్కువ నీటిని వాడాలని నిర్ణయించారు. మరో 8 నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఎండల తీవ్రతకు ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు.  3 నెలల కింద ఎల్ నినో ప్రభావం పెద్దగా లేదు. ఏదోలా వానాకాలం పంటల నుంచి బయటపడ్డాం’  అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘కరువుపై ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు.

రాజకీయ దురుద్దేశంతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు. మామ, అల్లుళ్లు మాత్రమే మేధావులా.. ? బ్రిటన్ లాంటి దేశంలో కూడా ఎల్ నినో వల్ల కరువును ఎదుర్కొంటున్నారు’ అని కేసీఆర్, హరీశ్‌రావుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న హరీశ్ రావును నమ్ముకుని పంటలు వేసుకుంటే.. మట్టి పోసి అంబలి తాగాల్సి వస్తుంది. ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. ప్రజల్లో అవగాహన కల్పించాలి’ అని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు. 

బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి..

‘బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టే ఓపిక మన నేతలకు ఉండట్లేదు. ప్రజలకు సరిగ్గా వివరించకపోతే.. మనం రాజకీయంగా దెబ్బతింటాం. మనం వాస్తవాలు చెప్పకపోతే.. బీఆర్‌ఎస్ నేతల ప్రచారాన్నే జనం నమ్ముతారు’ అని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ సూచించారు. ‘చేసిన పనిని చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డాం.

ఎల్ నినో సమయంలో 20వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వడం అనేది అద్భుతమైన విజయం. మా ఊరు కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి సోలార్ సిస్టం పెట్టారు. వాళ్ల ఇంటి అవసరాలు తీరడంతోపాటు బయటకు అమ్మి రూ. 10 వేల నుంచి 15 వేల వరకు సంపాదించుకుంటున్నారు’ అని తెలిపారు. ఈసారి ఊహించకుండా 20 శాతం వరకు విద్యుత్ వినియోగం పెరిగిందని, అధికారులు 24 గంటలూ కష్టపడి విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఈ విషయంలో భట్టి విక్రమార్కను, అధికారులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ప్రజాప్రతినిధులు గ్రామాల బాట పట్టాలి 

సంక్రాంతి పండుగ తర్వాత నుంచి మే నెలాఖరు వరకు ప్రజాప్రతినిధులంతా గ్రామాల బాట పట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధుల ఫోన్లలో మానిటరింగ్ యాప్ పెట్టి పర్యవేక్షిస్తామని.. గ్రామాల్లో, వ్యవసాయ భూముల్లో మట్టి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ‘ప్రతి మనిషికీ పని కల్పించాలి.. ప్రతి ఒక్కరికీ కడుపు నిండా అన్నం పెట్టాలి. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలి’ అని స్పష్టం చేశారు.

ఏసీల వాడకాన్ని తగ్గించుకోండి..

ఎల్ నినో ప్రభావం వల్ల ఎండ వేడి విపరీతంగా పెరుగుతుందని, నీళ్లు అందుబాటులో ఉండవని..  ఎండ వేడి, నీటి కొరత వల్ల విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ ఏడాది 20వేల మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగిందని తెలిపారు. ‘తాగడానికి నీళ్లు లేవు.. ఇక వ్యవసాయానికి నీళ్లు ఎలా ఇస్తాం..? తాగునీటి అవసరాలు తీర్చుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇది క్యాన్సర్ లాంటి నిజం.. ముందే ప్రజలకు చెప్పడం మంచిది.

సాగు నీరే లేనప్పుడు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం అసాధ్యం. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. యూనిట్ కు రూ. 15 పెట్టినా కరెంట్ దొరికే పరిస్థితి లేదు. కరెంట్ విషయంలో పొదుపు మంత్రం పాటించాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో పగలు ఫ్యాన్లు వేయొద్దు. ఏసీల వాడకాన్ని తగ్గించుకోవాలి. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలి’ అని ఆయన అన్నారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.  

కేసీఆర్ మాటలు నమ్మి శ్మశానానికి..!

‘2019, 2020లో కరోనా వచ్చింది. కరోనా గురించి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు.. ఎండ కొడితే, క్రోసిన్ వేసుకుంటే పోతుందని కేసీఆర్ దబాయించి మాట్లాడారు. కరోనాను సీసాలో వేసి బంధిస్తానన్నట్లుగా ఆయన అన్నారు. నాడు లక్షలాది మంది కరోనాతో చనిపోయారు. శ్మశానాల్లో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. నాడు ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు నమ్మారు. ఆయన బాధ్యత లేకుండా కరోనాపై మాట్లాడటం వల్ల ఆ మాటలు నమ్మి చాలా మంది శ్మశానాలకు వెళ్లారు.

కేసీఆర్ మాటలు నమ్మని వాళ్లు ఈ రోజు బతికి ఉన్నారు. కోట్లాది మంది వలస కార్మికులు కరోనా సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకం ఆ నాడు ఆకలి తీర్చింది. మతం పేరుతో విడగొట్టి అధికారంలోకి రావాలని మోదీ అంటున్నారు.. మానవత్వాన్ని కూడగట్టి అధికారంలోకి రావాలని మనం అంటున్నాం. కరోనా సమయంలో మోదీ ఏం చెప్పినా చేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

వానాకాలం పంటలను రక్షిస్తాం..

‘వానాకాలం పంటలను ఏదో రకంగా రక్షిస్తాం.. కొనుగోలు చేస్తాం. ఏడు రకాల సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని గత సీజన్‌లో చెప్పాం. సన్న వడ్లను ఏడు రకాలకే పరిమితం చేయడం బోనస్ ఎగ్గొట్టడానికేనని హరీశ్ రావు ఆరోపించారు. మార్కెట్లో రూ.3,400 నుంచి రూ.4,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు అడ్వాన్స్‌లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు నమ్మి ఏడు రకాల సన్న వడ్లు పండించినందుకు అత్యధిక ధర వచ్చింది. కేటీఆర్, హరీశ్ రావు బద్నాం చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుని ప్రణాళికలు వేస్తే.. కేటీఆర్, హరీశ్ రావు అమలు చేస్తున్నారు. మనిషి పెరిగితే ఆలోచన పెరుగుతుందని అనుకోవడం అవగాహనారాహిత్యమే. తాటి చెట్టులా పెరిగినా ఆలోచన పెరగని వాడే హరీశ్ రావు. వడ్ల ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా  బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ విషయం హరీశ్ రావుకు తెలియదా..? కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని సీఎం రేవంత్ అన్నారు. 

15 లక్షల పంప్‌సెట్లు ఎండిపోయాయి..

30 లక్షల పంప్‌సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయని, వచ్చే సీజన్‌లో చుక్క నీరు కూడా దొరకదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  ‘ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవు. ప్రాజెక్టుల్లో  200 టీఎంసీల నీళ్లు కూడా లేవు.. డెడ్ స్టోరేజీకి చేరాయి. తాగునీటికి తప్ప సాగుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఈ విషయాన్ని దాచిపెడితే క్యాన్సర్‌లా మారుతుంది. ప్రభుత్వం నిజాలను ప్రజలకు వెల్లడించకపోతే అన్ని రకాలుగా దెబ్బతింటాం. రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించాలి.

నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం అత్యంత కీలకం. గ్రామాల్లో పశువుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి.. పశుగ్రాసం, తాగునీరు అందించాలి. ఉపాధి హామీ పథకంలో ఈ కార్యక్రమాలు చేపట్టాలి’ అని సీఎం రేవంత్ తెలిపారు. ‘మేం ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. 3 నెలల క్రితం మేం ఎల్ నినోపై మాట్లాడినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నీళ్లు కావాలని, కరెంట్ కావాలని ఎమ్మెల్యేలు ఇప్పుడు అడుగుతున్నారు. ఎంత కష్టమైనా వానా కాలం పంటకు నీరు ఇస్తాం. హైదరాబాద్‌తో పాటు నగరాలు, గ్రామాల్లో తాగు నీరు సమస్య రాకుండా చూడాలి. తాగు నీటి సమస్యపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చే సమస్యలు వెంటనే పరిష్కరించాలి’ అని చెప్పారు. 

ఎల్ నినోపై ప్రతిరోజూ బులెటిన్..

ఎల్ నినో వల్ల ఎండలు మండిపోతాయని, వడ దెబ్బ ప్రభావంతో ప్రజలు ప్రాణాలు పోకుండా జాగ్రత్త వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఎల్ నినోపై ప్రతి రోజూ ఒక బులెటిన్ విడుదల చేస్తాం. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రోజువారీ సమాచారం ఇస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో హెల్ప్‌డెస్క్ పెట్టి అందరికీ సమాచారం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి’ అని ఆయన సూచించారు. 

మోదీపై జనంలో వ్యతిరేకత..

దేశంలో ప్రధాని మోదీపై విపరీతమైన వ్యతిరేకత ఉందని.. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తున్నదని.. జెన్ జీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘సర్’ను అడ్డుపెట్టుకొని ఈసారి గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని, దేశంలో ఆయన రెండు రకాల పౌరులను తయారు చేస్తున్నారని, ఇందులో ఒకరు ఓటు హక్కు ఉన్న ఆగర్భశ్రీమంతులు, మరొకరు ఓటు హక్కులేని నిరుపేదలని తెలిపారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని దుయ్యబట్టారు. ‘మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు దేశంలో 81 కోట్ల ఓట్లు ఉన్నాయి. రెండోసారి ప్రధాని అయినప్పుడు 91 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2024లో మూడోసారి ప్రధాని అయినప్పుడు 97 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2029 ఎన్నికలకు ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారు.

ఓట్ల సంఖ్య 84 కోట్లకు పడిపోయింది. 2026 నాటికి దేశ జనాభా 140 కోట్లకు పెరిగింది. దేశ జనాభా పెరిగితే ఓట్ల సంఖ్య కూడా పెరగాలి కదా..?  మోదీ నాలుగోసారి ప్రధాని కావడానికి 20 కోట్ల ఓట్లను తగ్గించాలని చూస్తున్నారు’ అని సీఎం ఆరోపించారు. ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ అనే నినాదంతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నారని, నవంబర్ 1న రాంలీలా మైదానంలో జరగబోయే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ నుంచి 10 వేల నుంచి 15 వేల మంది ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం కోరిందని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే 15 వేల మంది ఉన్నారని తెలిపారు.

నవంబర్ 1న రాంలీలా మైదానంలో తెలంగాణ తడాఖా చూపించాలన్నారు. ‘ఇటీవల సిరిసిల్లలో ఎలా తడాఖా చూపించామో, రాంలీలా మైదానంలో కూడా మనం తడాఖా చూపించాలి. పేదల ఓటు హక్కును కాజేయడానికి మోదీ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం’ అని చెప్పారు. కాగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని, యువకులు సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసిందని, వచ్చే 30 ఏండ్లపాటు పార్టీ కోసం పనిచేస్తారని, అందరం కలిసి గెలిపించుకోవాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 

ప్రతిమా శ్రీనివాసరావు కోసమే యాదాద్రి ప్లాంట్..

ప్రతిమా శ్రీనివాసరావు కోసమే కేసీఆర్ యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మించారని సీఎం రేవంత్ ఆరోపించారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు, ప్రతిమా శ్రీనివాస్‌కు రూ. లక్ష కోట్లు కట్టబెట్టేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. ‘రూ.లక్ష కోట్ల అవినీతి చేసేందుకే యాదాద్రి విద్యుత్ కేంద్రం కట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. అన్నీ కేసీఆర్ కుటుంబానికే వచ్చాయి. నీళ్లు ఫామ్‌హౌస్‌కు వెళ్లాయి. నిధులు బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాకు వెళ్లాయి ’ అని ఆయన వ్యాఖ్యానించారు.

బొగ్గు లేని దామరచర్లలో యాదాద్రి ప్లాంట్ కట్టడంతో ఏటా బొగ్గు రవాణాకు రూ. 2 వేల కోట్ల భారం పడుతున్నదని, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకే సింగరేణిలో లేని జీ-9 బొగ్గుతో విద్యుత్ తయారీ మిషనరీని చేపించారని అన్నారు. నాలుగేండ్లలో పూర్తి కావాల్సిన యాదాద్రి ప్లాంట్ ను పదేండ్లయినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. సింగరేణితోపాటు కోల్ ఇండియా దగ్గర, నైనీలోనూ జీ-9 బొగ్గు లేదని.. ఇప్పుడు జీ 12, జీ 13 బొగ్గుతో యాదాద్రి ప్లాంట్ నడుపుతున్నామని తెలిపారు. ‘పాలు హరీశ్‌రావు, డ్రగ్స్ కేటీఆర్, కాళేశ్వరం నీళ్లు కేసీఆర్, విదేశాల నుంచి మందు సరఫరాను సంతోష్, ఇసుక సంతోష్ రావు తండ్రి తీసుకున్నారు’ అని ఆయన దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తలు