డంపింగ్ యార్డ్ ఎత్తేసేదాకా పోరాటం
- జవహర్‌నగర్ సమస్యలపై వెనుకడుగు వేసేదే లేదు
- రేవంత్ రెడ్డికి రాజకీయ పునర్జన్మనిచ్చింది స్థానికులే
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- పాదయాత్రలో బీజేపీ ఎమ్మెల్యేలం పాల్గొంటాం: ఏలేటి
మేడ్చల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జవహర్‌నగర్ నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ పునర్జన్మనిచ్చింది ఈ ప్రాంత ప్రజలేనని పేర్కొన్నారు. అలాంటి వారిని రేవంత్‌రెడ్డి నేడు విస్మరించారని విమర్శించారు. ఈ నెల 27న చేపట్టనున్న పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని శుక్రవారం ద్మగూడలో నిర్వహించారు. డంప్ యార్డ్ బాధితులతో పాటు బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ద్వారా 12 మిలియన్ టన్నుల మీథేన్ గ్యాస్ విడుదలవుతోందని, ఇది 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యం కంటే ఎక్కువని పేర్కొన్నారు. దీనివల్ల మనుషులకు, పశువులకు గర్భస్రావాలవుతున్నాయని, కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వరకు కూడా ప్రభావం ఉందని, భవిష్యత్తులో మరింత ప్రమాదకర పరిస్థితులు ఎదురుకానున్నాయని తెలిపారు.
ఈ విషయమై పార్లమెంటులో మాట్లాడాలని కేంద్ర మంత్రి కట్టర్‌ను కలిసి వివరించానని, రాష్ట్ర ప్రభుత్వ నివేదికతో రావాలని మంత్రి సూచించారని ఈటెల పేర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన పదవిని రాజకీయంగా ఎదగడానికి మెట్టుగా వాడుకున్నారే గానీ, ఈ ప్రాంతానికి రేవంత్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ విషయంలో భేషజాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. డంపింగ్ యార్డ్ ఉద్యమానికి పార్టీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హామీ ఇచ్చారని తెలిపారు.
అనంతరం బీజేపీఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఉద్యమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరం పాల్గొననున్నట్లు తెలిపారు. ఎప్పుడూ రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్‌గాంధీ, అందులోని 21వ సెక్షన్ లో ఏముందో చూడకపోవడం విచారకరమన్నారు.
ఈ సమావేశానికి పట్లోళ్ల విక్రమ్ రెడ్డి అధ్యక్షత వహించగా, సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, ఎస్ మల్లారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, సామ రంగారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, తిరుపతి యాదవ్, మనసురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ రజిత దేవేందర్ రెడ్డి, షామీర్పేట్ మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ బాబు, మాజీ ఎంపీటీసీ రషీదా బేగం తదితరులు పాల్గొన్నారు.