సత్తుపల్లి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక చర్చ
- రూ.5 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల
సత్తుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ(Singareni Institute) పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సింగరేణికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి అవసరాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayee Dayanand) సమావేశంలో వివరించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చర్చించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం విడుదల చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం కలగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి.భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి సంస్థల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.