గ్రామాభివృద్ధిలో సెక్రటరీలదే కీలకపాత్ర

28-09-2026 | 10:30pm

- బాధ్యతగా పనిచేయాలి.. సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిస్తాం

- పనితీరు మెరుగుపర్చుకోకపోతే వెళ్లిపోవచ్చు

- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలకపాత్ర అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయాన్ని వెచ్చించి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, చెత్త సేకరణ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సోమవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మండలంలోని 28 గ్రామాల పంచాయతీ సెక్రటరీలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సెక్రటరీలతో చర్చించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, వీధుల శుభ్రత, చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యల పరిష్కారం తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్రటరీలు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

పనితీరు ఆధారంగానే గ్రామాల అభివృద్ధి

పంచాయతీ సెక్రటరీల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మెరుగ్గా పనిచేసే సెక్రటరీలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పనితీరు మెరుగుపర్చుకోని వారు ఇక్కడ పనిచేయలేకపోతే వెళ్లిపోవచ్చని సూచించారు. ప్రతి నెలా సెక్రటరీల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటానని స్పష్టం చేశారు.

వేసవిపై ముందస్తు ప్రణాళిక

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ముందుచూపుతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మల్టీపర్పస్‌ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.ఈ సమావేశంలో మునుగోడు ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంపీవో, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, మండల ముఖ్య నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు