అత్యవసర వేళ 108కు సమాచారం ఇవ్వాలి
► హార్ట్ ఎటాక్, ప్రమాదాల్లో ఆలస్యం వద్దు
► బాధితుడి వివరాలు, లొకేషన్ స్పష్టంగా చెప్పాలి
► తక్షణ వైద్యం కోసం 108 సేవలను వినియోగించాలి
నాగిరెడ్డిపేట,సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదం తదితర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని జిల్లా కోఆర్డినేటర్ బి.తిరుపతి(District Coordinator B. Tirupati), ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుడి తరఫున అంబులెన్స్‌కు ఫోన్ చేసే సమయంలో తడబడకుండా సంఘటనకు సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. బాధితుడి పరిస్థితి, ప్రమాదం జరిగిన ప్రదేశం, ఖచ్చితమైన లొకేషన్ తదితర వివరాలను 108 సిబ్బందికి తెలియజేయాలని పేర్కొన్నారు.
వివరాలు స్పష్టంగా చెప్పడం వల్ల అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఛాతీ నొప్పి,హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించినప్పుడు, అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సకాలంలో వైద్యం అందించడం కీలకమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా చేయకుండా వెంటనే 108కు కాల్ చేయాలని కోరారు. 108 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బి.తిరుపతి, జనార్ధన్ సూచించారు.