కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
నిమ్మపల్లిలో గ్రామస్థులు, మహిళల నిరసన.. కోతుల బెడద నుంచి రక్షించాలని డిమాండ్.
కోనరావుపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కోతుల దాడి(Monkey Attack)లో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామస్థులు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురై మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
నిమ్మపల్లికి చెందిన కూరగాయల బుధవ్వ భర్త మృతి చెందడంతో కుమార్తె వద్ద ఉంటోంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని కోతులు ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశాయి. కాళ్ల పిక్కలపై తీవ్రంగా కరవడంతో రక్తస్రావమై బుధవ్వ స్పృహ కోల్పోయింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయపడిన బుధవ్వను గ్రామస్థులు అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రక్తస్రావంతో ఉన్న ఆమె పరిస్థితిని చూసి గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కోతులు, వీధి కుక్కల బెడదతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని మహిళలు, గ్రామస్థులు తెలిపారు. పలుమార్లు సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.కోతులు, కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రమాదకర జంతువుల నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.