రామప్పలో ఆక్టోపస్, పోలీసుల మాక్ డ్రిల్

28-09-2026 | 10:14pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రామప్ప దేవాలయం(Ramappa Temple)లో సోమవారం ఆక్టోపస్, ములుగు జిల్లా స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్(Police Mock Drill) నిర్వహించారు. ప్రముఖ చారిత్రక, పర్యాటక ప్రదేశాల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేదా ఇతర సంఘ విద్రోహ శక్తులు చొరబడిన సందర్భంలో వారిని ఎలా ఎదుర్కోవాలి, పర్యాటకులు, భక్తుల భద్రతను ఎలా కాపాడాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పోలీసు బలగాలు సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలు, అనుమానితులను గుర్తించడం, దాడి జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం, ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించడం వంటి అంశాలను మాక్ డ్రిల్‌లో ప్రదర్శించారు. అలాగే గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడం, అవసరమైతే అగ్నిమాపక సేవలను వినియోగించడం వంటి అత్యవసర చర్యలపై కూడా కసరత్తు చేశారు.

రామప్ప దేవాలయం వంటి ప్రముఖ చారిత్రక కట్టడాలకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడంలో భాగంగానే ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి విన్యాసాల ద్వారా భద్రతా సిబ్బందికి అప్రమత్తత, సమన్వయం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ బలగాలతో పాటు ములుగు జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది, అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు