పదవి ఇస్తలేరు.. పైసలు ఇస్తలేరు!

02-11-2026 | 11:06pm
  1. నిధుల్లేక మునుగోడు అభివృద్ధి ఎలా సాధ్యం?
  2. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంపై ప్రభుత్వానికి కనికరం లేదా?
  3. 300 చెరువుల అభివృద్ధికి నిధుల కొరత
  4. డిండి ఎత్తిపోతలే నియోజకవర్గానికి జీవనాధారం
  5. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు, నవంబర్ 2 (విజయక్రాంతి): పదవి ఇస్తలేరు.. పైసలు ఇస్తలేరు.. అయినా మునుగోడు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నా.. అనుకున్న స్థాయిలో నిధులు రావడం లేదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Munugodu MLA Komatireddy Rajagopal Reddy ) తనదైన శైలిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను బహిరంగంగానే ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మునుగోడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలంటే డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

వికసిత్ భారత్–జి రామ్ జి కార్యక్రమంలో భాగంగా ఎల్‌నినో ప్రభావం, కరువు నివారణ చర్యలపై మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డిండి ఎత్తిపోతల పథకానికి నీటి వనరులపై స్పష్టత ఇవ్వలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించి ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

300 చెరువులు.. నిధుల కోసం ఎదురుచూపులు!

నియోజకవర్గంలో 300 చెరువులను గుర్తించి ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపినా నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం ఫ్లోరైడ్ బాధిత మునుగోడు చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోయిందని విమర్శించారు. రాబోయే వర్షాకాలంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేలా ఇప్పటి నుంచే చెరువుల అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

రైతులకు అండగా నిలవాలి!

ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గాయని, రైతులకు అధిక పరిహారం అందించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్‌కు సూచించారు. కౌలు రైతులను సైతం ఆదుకోవాలని కోరారు. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా సేంద్రియ పద్ధతుల్లో వాణిజ్య పంటలు సాగు చేసి అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినప్పుడే రైతులకు నిజమైన మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

తాను మంత్రి కాకపోవచ్చు.. ముఖ్యమంత్రి కాకపోవచ్చు.. కానీ క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కెపాసిటీలో ఎవరికీ తీసిపోనని వ్యాఖ్యానించారు. మునుగోడును అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, రైతన్నలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యాదాద్రి, నల్లగొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు