సర్ప రక్షకుడు.. స్వామి
చంపడం కాదు.. కాపాడాలి
సాధారణంగా పాము(Snake) కనిపించినప్పుడు భయంతో(Fear) దానిని చంపేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాము కాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. శీలం స్వామి మాత్రం ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పామును రెచ్చగొట్టకుండా దూరంగా ఉండాలని సూచిస్తూ, సాధ్యమైనంతవరకు దానిని సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాములు కూడా పర్యావరణ వ్యవస్థలో కీలక భాగమే. ఎలుకలు వంటి జీవుల సంఖ్యను నియంత్రించడంలో పాములు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల ప్రతి పామును విషసర్పంగా భావించి చంపడం కాకుండా, మనుషుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే పాముల సంరక్షణకు కూడా అవకాశం కల్పించాలన్న సందేశాన్ని శీలం స్వామి సేవ ప్రతిబింబిస్తోంది.
విషసర్పం కనిపిస్తే జనానికి హడల్. ఆయన మాత్రం ధైర్యంగా రంగంలోకి దిగి ఎంతటి కాలనాగునైనా ఒడిసి పట్టుకొని అడవిలో క్షేమంగా వదిలేస్తాడు. ఇలా వందలాది పాములకు ప్రాణ భిక్ష పెట్టి సురక్షితంగా అడవిబాట పట్టించాడు. వన్యప్రాణి సంరక్షణకు సేవా సంకల్పంతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమినాపురానికి చెందిన శీలం స్వామి పామును చంపొద్దనే అవగాహనతో ముందుకు సాగుతున్నారు.
పాములు అతన్ని చూస్తే అట్టే ఆగిపోతాయి. ఎంతటి కాలనాగునైనా ఇట్టే వడిసి పట్టి ఎలాంటి హాని తలపెట్టకుండా అడవిలో వదిలేయడం అతనికి చిన్నతనం నుంచి అలవాటుగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఎక్కడ పాము కనిపించిన వెంటనే అతనికి సమాచారం అందించడం, ఆ వెంటనే స్నేక్ క్యాచర్ స్వామి రంగంలోకి దిగి ధైర్యంగా పామును పట్టుకుని సురక్షితంగా అడవులో తీసుకెళ్లి వదిలేస్తాడు.
పాములను చంపకుండా, ప్రాణాలతో పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టే వ్యక్తిగా శీలం స్వామి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాములను పట్టుకోవడంలో అనుభవం, ధైర్యం, అప్రమత్తతతో ముందుకు సాగే ఆయన.. ఇప్పటివరకు వందల సంఖ్యలో పాములను పట్టుకుని అడవుల్లో వదిలినట్లు స్థానికంగా చెపుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే పాములను చంపకుండా వాటి సహజ ఆవాసాలకు తరలించడం ఆయన సేవలో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రమాదం అంచున సేవా సంకల్పం
పామును పట్టుకోవడం సాధారణ విషయం కాదు. విషపూరిత పాములను గుర్తించడం, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, సరైన పద్ధతిలో వాటిని నియంత్రించడం ఎంతో జాగ్రత్తతో కూడుకున్న పని. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఒకటి రెండుసార్లు ఆయన పాముకాటుకు గురై సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
అయినప్పటికీ ప్రజలకు పాము వల్ల ప్రమాదం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో శీలం స్వామి చేస్తున్న సేవ స్థానికంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. పాము కనిపిస్తే చంపేయడం కాదు.. ముందుగా మనుషుల భద్రతను కాపాడుతూ, పామును కూడా సురక్షితంగా సహజ ఆవాసానికి తరలించడం అవసరం. ఈ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శీలం స్వామి వంటి స్నేక్ క్యాచర్ల సేవకు ప్రాధాన్యం ఉంది.
బండి సంపత్ కుమార్ (విజయక్రాంతి, మహబూబాబాద్)