విజయక్రాంతి ఎఫెక్ట్.. తొలగిన ఫ్లెక్సీలు
వెంకటాపూర్, నవంబర్ 23 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా అడ్డుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై విజయక్రాంతి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కథనం వెలువడిన అనంతరం విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించడంతో అంబేద్కర్ విగ్రహం తిరిగి అందరికీ కనిపించేలా మారింది.అంబేద్కర్ విగ్రహం ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, డీఎస్పీ ప్రారంభించిన సీసీ కెమెరాల నిఘాకు సైతం అవి ఆటంకంగా మారిన విషయాన్ని విజయక్రాంతి వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన కట్టెకోళ్ల వెంకటేష్ తన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ అంబేద్కర్ వాదులకు, అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ఇటీవల జరిగిన పీఏసీఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున పొరపాటున అంబేద్కర్ విగ్రహం వద్ద తన ఫ్లెక్సీ ఉండిపోయిందని వివరించారు. తెల్లవారే తొలగించాలని భావించినప్పటికీ, అనారోగ్య కారణాలతో తీయలేకపోయానని పేర్కొన్నారు.ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.