తాల్లగూడెం కోడి పుంజుల అంగడిపై పోలీసుల ఆకస్మికంగా దాడి...?
- పోలీసుల అదుపులో 200 మంది పందెం రాయుళ్ళు...!
- వాట్సప్ ప్రత్యేక గ్రూపు ద్వారా కోడి పందాల నిర్వహణ
ములుగు, నవంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు(Telangana-Chhattisgarh border) ప్రాంతాల్లో గత కొంతకాలంగా యదేచ్చగా సాగుతున్న కోడిపందాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కోడి పందాల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకొని క్షణాల్లో సమాచారం చేరవేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కోడిపందెంలో పాల్గొనేందుకు పందెం రాయలు వారానికి రెండు రోజులపాటు ఈ సరిహద్దు ప్రాంతానికి చేరుకొని కోడిపందాలలో పాల్గొంటారు. ప్రతివారం సుమారు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు కోడిపందాలు జరుగుతున్నట్లు సమాచారం జాతరను తలపించేలా కోడిపందెం బరి సమీపంలో ఏర్పాట్లు చేయడం మరో విశేషం.
కాగా మంగళవారం చతీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తాలూకాలోని తాళ్లగూడెం గ్రామంలో కోడి పుంజుల పందెం రాయుళ్ల అడ్డాలపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి 200 నుంచి 300 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా కొన్ని రోజుల నుంచి పందెం రాయుళ్ళు రెచ్చిపోవడంతో బీజాపూర్ నూతన ఎస్పీ ఉమేష్ ప్రసాద్ గుప్త ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు సమాచారం.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మిపురం దేవాదుల, తుపాకులగూడెం, గూర్రేవుల, రాజన్నపేట, ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, ఏటూర్, సింగారం గ్రామాలకి చెందిన పలువురు ఉన్నట్టు సమాచారం. మండలం నుంచి నిత్యం సమ్మక్క బ్యారేజ్ గుండా లేదా నాటు పడవల ద్వారా గోదావరి నదిని దాటి పందెం కాస్తున్నట్టు సమాచారం.
చత్తీస్గడ్ రాష్ట్రంలో పట్టుబడిన వారిలో కన్నాయిగూడెం మండలానికి చెందిన పలువురు ఉండటం విశేషం. వాజేడు, నూగూరు వెంకటాపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున ఉన్నట్టు సమాచారం. కాగా పందెం రాయులను పోలీసులు అదుపులోకి వారి సమాచారం తెలియక కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఫోన్లు చేయడంతో స్విచ్చాఫ్ రావడంతో ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో భద్రాచలం, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, బెల్లంపల్లి, చెన్నూరు జిల్లాల పందెం రాయుళ్ళు ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రలోని అంకీస, ఆసరల్లి, టేకడ పాతగూడెం గ్రామాలకి చెందిన వాళ్ళు ఉన్నట్టు సమాచారం.