గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలు లేవు

03-11-2026 | 10:35pm
  1. ఆర్టీఐ సమాచారాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం సరికాదు
  2. ఉన్నతాధికారుల మార్గదర్శకాలతోనే నడుచుకున్నాం 
  3. స్వలాభం కోసం అభివృద్ధిపై ఆరోపణలు చేయడం సరికాదు 
  4. భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ,ఈవో శ్రీనివాసరావు

భద్రాచలం (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, శ్రీరామనవమి ఉత్సవాల ఖర్చులకు సంబంధించి, గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని భద్రాచలం(Bhadrachalam) మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ దొర, గ్రామపంచాయతీ కార్య నిర్వహణ అధికారి(ఈవో) శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల గ్రామపంచాయతీపై వస్తున్న ఆరోపణల నేపద్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని అందించినప్పటికీ, దానిని వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక వనరులతో ఎన్నికల నిర్వహణ ఖర్చుల కోసం రూ.9,72,905 చెల్లించినట్లు తెలిపారు.

నూతన పాలకవర్గం తీర్మానం నంబర్ 54 ప్రకారం ప్రభుత్వ గ్రాంటు విడుదలైన అనంతరం తిరిగి జమ చేసే షరతుతో ఈ చెల్లింపులు జరిపినట్లు వివరించారు.అలాగే శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక అధికారి ఆమోదంతో రూ.10 లక్షల అడ్వాన్స్ డ్రా చేసుకునేందుకు తీర్మానం చేయగా, కార్యాలయ కలెక్షన్ల నుంచి ఖర్చులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఉత్సవాల సందర్భంగా అత్యవసర పనులకు రూ.11,28,965 ఖర్చు చేసినట్లు, ఇవన్నీ కలెక్టర్ మార్గదర్శకాలు, ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోనే జరిగాయని స్పష్టం చేశారు.

సుమారు 11 ఏళ్ల తర్వాత భద్రాచలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి పాలకవర్గం ఏర్పడిందన్నారు. పట్టణ అభివృద్ధి లక్ష్యంగా వివిధ వార్డుల్లో పనులు చేపట్టామని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మూడేళ్ల నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ఐటీడీఏ రోడ్డు, చర్ల రోడ్డు, కూనవరం రహదారి పరిసరాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, రామాలయ అభివృద్ధి, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం వంటి పనులకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.పాలకవర్గం ఏర్పడి పది నెలలు దాటిందని, పట్టణ అభివృద్ధికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కొందరు స్వలాభం కోసం జరుగుతున్న అభివృద్ధిపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ చర్యలు తగవని అన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించి నిర్మాణాత్మక సూచనలు అందించాలని కోరారు.భద్రాచలాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భద్రాచలంలోని వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు