100 మంది సినీ దిగ్గజాలు.. ఏకైక భారతీయుడిగా కింగ్ ఖాన్

19-11-2026 | 05:18pm

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి ప్రపంచ వేదికపై భారతీయ సినిమా (Indian Cinema) సత్తాను చాటారు. ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ 'వెరైటీ' (Variety) విడుదల చేసిన ప్రపంచంలోని 100 గొప్ప సినీ తారల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 'ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్' పేరుతో ప్రకటించిన ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో షారుఖ్ ఖాన్ 92వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు ఆయనే కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ దిగ్గజాలు ఉన్న ఈ జాబితాలో షారుఖ్ పేరు ఉండటం భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, భావోద్వేగ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.

వెరైటీ ప్రకటించిన ఈ జాబితాలో ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో హమ్‌ఫ్రీ బొగర్ట్, మూడో స్థానంలో దిగ్గజ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ చోటు దక్కించుకున్నారు. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత నటుల సరసన షారుఖ్ ఖాన్ పేరు కూడా ఉండటం విశేషం.ఈ అరుదైన గుర్తింపుతో షారుఖ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా కింగ్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన నటుల్లో షారుఖ్ ఒకరని అభిమానులు కొనియాడుతున్నారు.

మొత్తంగా వెండితెరపై తనదైన నటన, ప్రత్యేకమైన స్టైల్, ప్రపంచవ్యాప్త అభిమానగణంతో దూసుకెళ్తున్న షారుఖ్ ఖాన్‌కు ఈ గుర్తింపు మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. బాలీవుడ్ బాద్‌షా నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు.. షారుఖ్ ఖాన్ స్టార్‌డమ్ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఇది!

మరిన్ని వార్తలు