మద్యం మత్తులో.... ఘోర రోడ్డు ప్రమాదం

22-10-2026 | 03:42pm

ఇద్దరికీ గాయాలు డ్రైవర్ తో పాటు, లైసెన్స్ లేని వ్యక్తికి కారు ఇచ్చిన యజమాని పైన కేసు నమోదు

మేడిపల్లి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తాగిన మైకంలో అతివేగంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి(Road accident) కారణమైన వ్యక్తితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసి వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మేడిపల్లి సీఐ డి.జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ సర్కిల్ వరంగల్ హైవే పిల్లర్ నంబర్ 57 హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, మెండే  శంకర్(53) ఇచ్చిన ఫిర్యాదు మేరకు,

ఆయన కుమారుడు సాయి శివ (30) అతని భార్య  మేఘన(28)తో కలిసి టిఎస్ 08ఈఆర్7435 (ఐ10) నంబరు గల కారులో ఎల్‌బీ నగర్ నుండి వరంగల్ జిల్లా నర్సంపేటకు వెళుతుండగా పీర్జాదీగూడ హైవే పిల్లర్ నంబర్ 57 సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వెనక నుంచి వచ్చిన టయోటా ఫార్చ్యూనర్ కారు అతివేగంగా ఢీకొట్టడంతో ముందున్న కారు  పల్టీలు కొట్టగా... 

ఫార్చ్యూనర్ కారు ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు కారులో ఉన్న సాయిశివ, అతని భార్య మేఘన గాయపడగా వారిని చికిత్స నిమిత్తం చైతన్యపురిలోని ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ కారు నడిపిన వ్యక్తిని  అకున్ సబర్వాల్, తండ్రి మంగీలాల్‌ గా  గుర్తించారు.

సదరు వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తమవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడిగినప్పుడు తన వద్ద లేదని తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఫార్చ్యూనర్ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ నకిలీదిగా గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం నడపడానికి అనుమతించినందుకు వాహన యజమాని మంగీలాల్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు