పురపోరుకు బ్రేక్.. సుప్రీం ఆదేశాలతో ఎన్నికలపై ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులకు అడ్డంకులు ఎదురయ్యాయన్న ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తీసుకున్న అనంతరం ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అక్టోబర్ 28న జరగాల్సిన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక ఎన్నికల తేదీలో మార్పు ఉంటుందా? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో రీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తారా? లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురయ్యాయని ఫిర్యాదులు వచ్చిన 19 మున్సిపాలిటీలకే చర్యలు పరిమితం అవుతాయా? లేక రాష్ట్రంలోని అన్ని 100 పట్టణ స్థానిక సంస్థలపై ప్రభావం కొనసాగుతుందా? అన్నది ఎస్ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఇప్పటికే ఏకగ్రీవమైన స్థానాల పరిస్థితి ఏమిటన్న దానిపైనా చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేశారా? లేక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మాత్రమే నిలిపివేశారా? అనే సందేహాలు అభ్యర్థులు, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల గడువు పొడిగింపు, ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అక్టోబర్ 27న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.