గిరిజన హక్కుల సాధనకు కొమరం భీమ్ పోరాటం స్ఫూర్తిదాయకం

22-10-2026 | 05:05pm

ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  జ్యోతి

హనుమకొండ, అక్టోబర్ 22(విజయ క్రాంతి):కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో(Kakatiya University Arts College) గురువారం కొమరం భీమ్ జయంతి వేడుకలను కళాశాల ఎస్సీ ఎస్టీ సెల్ సంచాలకులు డాక్టర్ పుల్లా రమేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం కొమరం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి, గిరిజన ప్రజల హక్కుల సాధన కోసం ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అడవి, భూమి, నీటిపై గిరిజనులకు హక్కులు ఉండాలనే ఆయన ఆకాంక్ష గిరిజన సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.కొమరం భీమ్ ఆశయాలను విద్యార్థులు తెలుసుకోవడంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, మానవీయ విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ద్వారా వారి ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ బిక్షపతి ,అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు