ఆదివాసి హక్కులకై పోరాడిన యోధుడు కొమరం భీమ్
ధూళిపాళ్ల.ధనుంజయ నాయుడు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): జల్ -జంగిల్- జమీన్ అంటూ నినదించి ఆదివాసుల హక్కులకై పోరాడిన వీరుడు కొమరం భీమ్ అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలో ఆదివాసి వీరుడు కొమరం భీమ్ 126వ జయంతి(Komaram Bheem 126th Jayanti)ని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా ధనుంజయ నాయుడు మాట్లాడుతూ.... నిజాం నిరంకుశ పాలలో ఆదివాసులపై అడవిలోకి వెళ్లకూడదని, పశువులు మేపకూడదని,పోడు వ్యవసాయం చేయకూడదoటూ ఎన్నో ఆంక్షలు విధించగా, కొమురం భీమ్ వ్యతిరేకించి సుమారు 12 గ్రామాలలో సొంత గోండు రాజ్యం ఏర్పాటు చేసుకొని పోరాటం చేసి తన వర్గ ప్రయోజనాల కొరకు చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడని ఒక నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో కొమరం భీమ్ ను చుట్టుముట్టి ఒంటరిని చేసి కాల్చి చంపారని ఈనాటికి గోండు సమాజంలో దేవుడిగా పూజిస్తారని, ఆయన పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేశారని అలాగే ట్యాంక్ బండ్ పై మరియు జోడేఘాట్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు.
యూపీఏ ప్రభుత్వo ఉన్నప్పుడు కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా వామపక్షాల సూచన మేరకు అటవీ హక్కుల చట్టం వచ్చిందని అందుకు స్ఫూర్తి కొమరం భీమ్ ఇచ్చిన జల్ జంగల్ జమీన్ పిలుపే కారణమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్, ఇన్సాఫ్ నాయకుడు ఎస్.కె సైదా కాశీం,రహీం,షరీఫ్, మెహబూబీ పాల్గొన్నారు.