విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..
మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ అమీద్
మెదక్, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి) : మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ అమీద్ (Telangana Minority Welfare Department Director Abdul Ameed) అన్నారు. శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ వీడియో సమావేశ హాల్లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, తాసిల్దారులు మైనారిటీ సంక్షేమ అధికారులతో జిల్లాలో మైనార్టీలకు అమలవుతున్న పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, విద్యార్థులకు స్కాలర్షిప్ షాది ఖానాలు సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ అమీద్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల దరఖాస్తులను పరిష్కరించి, ఎంక్వైరీ నిర్వహించి, వారికి లబ్ధి చేకూర్చాలన్నారు, అలాగే మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ అందించే విషయంలో ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం ముందుకు పోవాలన్నారు జిల్లా పరిధిలోని మైనారిటీ విద్యాసంస్థలు మరియు వక్ఫ్ భూముల రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లో పురోగతి కనపడాలన్నారు.మైనారిటీ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మరియు అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని అన్నారు.
నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలు, ఆర్థిక సహాయం అందించే లా చర్యలు తీసుకోవాలన్నారు. షాదీ ఖానాల నిర్మాణం విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి ఉపేందర్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూప్రాన్ బాలయ్య, నర్సాపూర్ రామకృష్ణ, సంబంధిత తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.