చదువు చెప్పాల్సినవేళ.. బడులకు తాళం!
* ఉపాధ్యాయ దినోత్సవం పేరుతో విద్యార్థులకు నష్టం
* ఎంఈఓ మౌఖిక ఆదేశాలతో పాఠశాలలు మూసివేశారన్న ఆరోపణలు
* పిల్లలను బడికి పంపిన తల్లిదండ్రులు.. ఇళ్లకు వెళ్లేసరికి తాళాలు!
పాపన్నపేట, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఉపాధ్యాయ దినోత్సవం.. ఉపాధ్యాయులకు సన్మానం.. మరి విద్యార్థుల సంగతేంటి? ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవ వేడుక సందర్భంగా పాపన్నపేట మండలంలోని పాఠశాలలకు మధ్యాహ్నం నుంచే సెలవు ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బడికి పంపిన పిల్లలకు.. ఇంటి తాళాలు!
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తల్లిదండ్రులు ఉదయాన్నే పిల్లలను పాఠశాలకు పంపి వ్యవసాయ పనులకు వెళ్తారు. పిల్లలు సాయంత్రం వరకు బడిలో ఉంటారన్న నమ్మకంతో తల్లిదండ్రులు తమ పనులకు వెళ్తారు.
పిల్లల భద్రతకు ఎవరు బాధ్యత?
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చిన్నారులు పొలాల వైపు వెళ్లడం.. ఆటల కోసం చెరువులు, కుంటలు, బావుల సమీపానికి చేరడం జరిగితే పరిస్థితి ఏంటి? తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
సన్మానం కోసం.. పాఠశాలలకు సెలవు ఎందుకు?
ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం తప్పు కాదని.. కానీ అందుకోసం విద్యార్థుల పాఠశాల సమయాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
అధికారుల అత్యుత్సాహమా.. ఆదేశాల ఉల్లంఘనా?
పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు ప్రకటించేందుకు జిల్లా స్థాయిలో అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? ఉంటే వాటి ఆధారంగా సెలవు ప్రకటించారా? లేక కేవలం మౌఖిక ఆదేశాలతోనే పాఠశాలలను మూసివేశారా?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మౌఖిక ఆదేశాలతో పాఠశాలలను మూసివేసినట్లయితే.. ఆ ఆదేశాలకు ఆధారం ఏమిటో విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ దృష్టిసారించాలి
విద్యార్థుల భద్రత, విద్యా సమయం విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయం.. కానీ ఆ రోజున చదువుకునే విద్యార్థుల హక్కు, వారి భద్రత అంతకంటే గొప్ప విషయం కాదా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.