గణపయ్య మండపం వద్ద ముస్లిం యువకుని అన్నప్రసాద వితరణ
- వెళ్లి విరిసిన మతసామరస్యం
- 7 సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ చేస్తున్న చోటు
పాపన్నపేట,సెప్టెంబర్20: మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు(Navratri celebrations) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు లంబోదరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. వాడవాడలో కొలువైన గణపయ్య మండపాల వద్ద భజనలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలతో భక్తులు పరవశించి పోతున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రం పాపన్నపేట లోని అడ్డా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపయ్య మండపం వద్ద ఆదివారం మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామానికి చెందిన వార్డు సభ్యులు అహ్మద్ (చోటు) అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
గత 7 సంవత్సరాలుగా ప్రతి ఏటా గణపయ్య మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తుండటంతో మతసామరస్యానికి ప్రతీకగా మారింది. హిందూ ముస్లింల ఐక్యతకు అద్దం పట్టే ఈ ఘటన అంతట హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలోని ఆయా యువజన సంఘాల సభ్యులు చోటును ఘనంగా సత్కరించారు.