ఎనిమిదో అసెంబ్లీ సమావేశాల్లో దద్దరిల్లిన బీర్ల అయిలయ్య గళం
ప్రజా సమస్యలు, ఆలేరు అభివృద్ధిపై వరుసగా ప్రస్తావనలు.. 7 సార్లు సభలో ప్రసంగం
ఆలేరు, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ (Telangana Legislative Assembly)ఎనిమిదో సమావేశాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Aleru MLA Beerla Ailaiah) ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై తన వాణిని బలంగా వినిపించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సభలో ప్రస్తావించడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ ప్రభుత్వ పక్షాన్ని సమర్థంగా వినిపించారు. సమావేశాల్లో మొత్తం ఏడు సార్లు సభలో మాట్లాడిన బీర్ల అయిలయ్య.. 128.56 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చట్టాలు, చట్ట సవరణలపై చర్చించారు.
సభలో ప్రస్తావించిన ప్రధాన అంశాలు
సభాపతి గౌరవం కాపాడాలి: సభాపతిని అవమానించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీర్ల అయిలయ్య కోరారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్–బీజేపీ అనుబంధంపై విమర్శలు: బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రాజకీయ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఇరు పార్టీల రాజకీయ వైఖరిపై ప్రశ్నలు సంధించారు.
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం: ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొంటూ ఆలేరు నియోజకవర్గంలో అవసరమైన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు.
తుర్కపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటు: తుర్కపల్లి మండలంలో ఐటీ పార్క్‌తో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. టైర్ల పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ కులగణన చేపట్టాలి: రాబోయే జనగణనలో బీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. కులగణన ద్వారా బీసీల జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు: ఆలేరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి యాదాద్రి ఆలయ ఆదాయంలో వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
సాగు, తాగునీటి సమస్యలపై చర్చ: ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడుతోందని సభలో ప్రస్తావించారు. సాగు, తాగునీటి లభ్యత తగ్గడం, దాని ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరగడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తూ, ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై బీర్ల అయిలయ్య చర్చించడం ద్వారా నియోజకవర్గ సమస్యలను శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.