డివైడర్‌ను ఢీకొని కారు దగ్ధం: వ్యక్తి సజీవదహనం!
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి సమీపంలో జాతీయ రహదారిపై ఘటన.
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రోడ్డుపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో కారు పూర్తిగా దగ్ధమై అందులో ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన జిల్లాలోని ఖమ్మం–హైదరాబాద్ 365 బీబీ జాతీయ రహదారిపై(Khammam–Hyderabad National Highway 365) పిల్లలమర్రి సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నుండి హైదరాబాద్ వైపుకు వేగంగా వెళ్తున్న కారు పిల్లలమర్రి సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయన్నారు.
మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే కారులో ఒక్కరే ఉన్నారా.. మరెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ఖమ్మం టోల్ ప్లాజాల వద్ద పోలీసులు సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.