తవక్కల్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి
విద్యా సంస్థల చైర్మన్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన
మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పరిధిలోని తవక్కల్ విద్యాసంస్థల(Tawakkal Educational Institution) తీరుకు నిరసనగా రామకృష్ణాపూర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం వామపక్ష విద్యార్థి సంఘాల (AISB, SFI, PDSU) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు(Government Approvals) లేకుండా అక్రమంగా పదవ తరగతి (10th Class) తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న తీరును ప్రశ్నించడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులపై(student union leaders) దుర్భాషలాడుతూ భౌతిక దాడికి యత్నించిన పాఠశాల చైర్మన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలను బొందపెట్టి అక్రమ తరగతులు నడుపుతున్నారనే విషయాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక చైర్మన్ అహంకారపూరితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ వెంకటస్వామి పేరు చెప్పుకొని, పోలీసు వ్యవస్థను, ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా బెదిరింపులకు దిగడం సిగ్గుచేటన్నారు.
విద్యా సంస్థను వ్యాపార కేంద్రంగా మార్చి, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థి సంఘాల నాయకులపై దుర్భాషలాడి, భౌతిక దాడికి ప్రయత్నించిన తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, అనుమతులు లేకుండా అక్రమ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక వేధింపులకు గురిచేస్తున్న పాఠశాల గుర్తింపును (Recognition) విద్యాశాఖ వెంటనే రద్దు చేయాలనీ, రాజకీయ అండదండలు చూపి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో AISB జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, PDSU రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, SFI జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్, PDSU జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్, AISB జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.