ఇల్లెందులో జంట ఆత్మహత్య.. కలకలం
- ఒకే ఇంట్లో అత్త, మేనల్లుడు బలవన్మరణం
- మృతికి కారణాలపై పోలీసుల విచారణ
ఇల్లెందు, అక్టోబర్ 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) ఇల్లెందు పట్టణంలోని గోవింద సెంటర్ దాసరిగడ్డ ప్రాంతంలో జంట ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకే ఇంట్లో శ్రీనివాస్, కళ్యాణి మృతిచెందగా, వీరిద్దరూ వరుసకు అత్తా, మేనల్లుడని సమాచారం.
రెండు మూడు రోజుల క్రితమే వీరు మృతిచెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాల నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
వీరు ఎందుకు మృతిచెందారు? ఘటన జరిగి ఎన్ని రోజులైంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధం ఏమైనా కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
గతంలో పంచాయతీ జరిగినట్లు ప్రచారం..
కళ్యాణి, శ్రీనివాస్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై గతంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఒకే ఇంట్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఒకే ఇంట్లో ఇద్దరి మృతి.. దాసరిగడ్డలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కొవ్వాకుల కళ్యాణి, తెలకలపల్లి శ్రీనివాస్ ఒకే ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడంతో అసలు ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరిద్దరి మరణాలకు దారితీసిన పరిస్థితుల పై స్థానికులు చర్చించుకుంటున్నారు.