అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు

29-10-2026 | 08:08pm

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): 2026–27 ఖరీఫ్ సీజన్‌(Kharif season)లో ధాన్యం కనీస మద్దతు ధర కొనుగోళ్ల నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా కట్టడి చేసేందుకు జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామం సమీపంలోని లక్ష్మీపూర్ వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు(Additional Collector V. Ramulu) ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర సరిహద్దులోని సిరొంచా ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాల ధాన్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

చెక్‌పోస్టు వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులకు బదిలీల వారీగా విధులు కేటాయించడం జరిగిందని, సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ, చెక్‌పోస్టును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బందిని జైపూర్ ఎ సి పి, జిల్లా వ్యవసాయ అధికారి, కోటపల్లి తహసిల్దార్ సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు. రాజస్వ మండల అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌లు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం వాహనాలను జిల్లాలోకి అనుమతించరాదని, ఆదేశాలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని పి ఎ సి ఎస్ కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని తీసుకురాకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, ఇతర రాష్ట్రాల ధాన్యం గుర్తించిన పక్షంలో స్వాధీనం చేసుకొని, సంబంధిత రైతులకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ, స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు