వ్యవసాయ శాఖ సేవలు దూరం

03-10-2026 | 05:35am
  1. నాలుగు క్లస్టర్లకు ఇద్దరే ఏఈఓలు
  2. రైతులకు తప్పని ఇబ్బందులు 

కోటపల్లి, అక్టోబర్ 2 : మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలంలోని రైతులకు(Farmers) వ్యవసాయ శాఖ సేవలు(Agriculture Department Services) అందడం లేదు. మండలాన్ని నాలుగు (కోటపల్లి, దేవులవాడ, మల్లంపేట, సిర్ష) క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్ల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగు సమయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

కానీ కోటపల్లి మండలంలో కేవలం ఇద్దరు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారీ(Agriculture Extension Officer)(ఏఈవో)లే నాలుగు క్లస్టర్లలో ఉన్న రైతులకు వ్యవసాయ సేవలు అందిస్తున్నారు. పంటల సాగు సమయంలో రైతులకు వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. పంటల్లో తెగుళ్లు వచ్చినా, ఎరువుల వినియోగంపై సందేహాలు ఉన్నా, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా వ్యవసాయ శాఖ అధికారులతోనే పని. మండలంలో సిబ్బంది కొరతతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

 సిబ్బంది లేక ఇబ్బంది...

మండల రైతులకు సేవలందించేందుకు సరిపడా సిబ్బంది లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాలుగు క్లస్టర్ల గాను ఇద్దరే ఉండడంతో వారి ద్వారా రైతులకు సరైన సేవలు అందడం లేదు. పెద్ద మండలంలో ఉన్నదే ఇద్దరు ఏఈవోలు అంటే ఇందులో ఒకరు మెటర్నిటీ లీవ్ లో వెళ్లారు. దీంతో మండలం మొత్తం ఒకే చూడాల్సి వస్తుంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

రైతులకు అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది కొరతతో అనేక ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలపై సరైన అవగాహన పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రభుత్వ వ్యవసాయ పథకాల సమాచారం, తదితర రైతు సేవలు సకాలంలో అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల అధికారి ఉన్నా.. మరో మండలానికి డిప్యుటేషన్

కోటపల్లి మండలానికి రెగ్యులర్ వ్యవసాయ శాఖ మండల అధికారి ఉన్నప్పటికీ, ఆయనను మరో మండలానికి డిప్యూటేష్ప పంపడం వల్ల రైతులకు అవసరమైన సమయంలో అధికారుల సేవలు అందుబాటులో ఉండడం లేదని రైతులు చెబుతున్నారు. మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో అధికారి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. కోటపల్లి మండలం విస్తీర్ణం పెద్దది కావడం, వ్యవసాయం సైతం పెద్ద మొత్తంలో సాగవుతుండడం, రైతులకు సలహాలు ఇచ్చే మండల వ్యవసాయ అధికారి మరో మండలానికి ఇంచార్జీగా ఇవ్వడం, క్షేత్రస్థాయిలో పనిచేసే ఏ ఈ ఓ లు సైతం లేకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అయోమయంలో రైతులు..

రైతులు ఏ సర్వే నెంబర్లు ఏ పంట సాగు చేస్తున్నారో వివరాల నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎరువుల కోసం ఆన్లైన్ ప్రక్రియలు, పంట విక్రయాలకు సంబంధించిన విధానాలు వంటి అంశాలపై స్పష్టమైన మార్గద ర్శకత్వం అందక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పంటలకు సంబంధించి ఇతరత్రా వివరాల కోసం ఎవరిని సంప్రదించాలి..? ఏ పత్రాలు అవసరం..? అనే విషయాల్లోనూ స్పష్టత లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు సంక్షేమం మాటల్లో కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించాలంటే ముందుగా రైతుకు అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖ వ్యవస్థను బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఏఈవోలను ఏర్పాటు చేస్తాం

మండలంలో నాలుగు క్లస్టర్లకు ప్రస్తుతం ఒక ఏఈఓనే విధులు నిర్వహిస్తుంది. రైతులకు మెరుగైన సేవలందించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే మండలానికి కేటాయిస్తాం. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సలహాల కోసం అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.

- బానోత్ ప్రసాద్, ఏడీఏ చెన్నూర్ 

మరిన్ని వార్తలు