మందమర్రి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ
- నేరాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- సీపీ అంబర్ కిషోర్ ఝా
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం మందమర్రి సర్కిల్ కార్యాలయాన్ని డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి తనిఖీ చేశారు. సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమబద్ధంగా ఉంచడంతో పాటు వాటికి సంబంధించిన వివరాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో 5S విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి, అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన ఫైళ్లను సీపీ పరిశీలించారు. దర్యాప్తు పురోగతి, కేసుల ప్రస్తుత స్థితి, నిందితుల అరెస్టులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, వాటి పెండింగ్‌కు గల కారణాలను సీఐ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. నేర దర్యాప్తులో వస్తున్న ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మందమర్రి సర్కిల్ అత్యంత కీలకమైన ప్రాంతమని, మందమర్రి పెద్ద పట్టణ ప్రాంతం కావడంతో పాటు రామకృష్ణాపూర్ పట్టణ శివారు ప్రాంతాలు, కాసిపేట, దేవాపూర్ ప్రాంతాలు దూరంగా ఉండటం, మారుమూల, గిరిజన ప్రాంతాలు కూడా ఉండటంతో పోలీసులకు ప్రత్యేక సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించి, చట్ట పరిధిలో సాధ్యమైనంత సహాయం అందించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ వెంట మంచిర్యాల ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పి రమేష్ తదితరులున్నారు.