ఆన్లైన్ గేమ్ యాప్ మోజులో రూ.18 లక్షలు స్వాహా

03-11-2026 | 03:44pm

యువకుడిని మోసం చేసిన వ్యక్తి..నిందితుడి అరెస్ట్.. రూ.6 లక్షలు రికవరీ

జడ్చర్ల, నవంబర్ 03: ఆన్లైన్ గేమ్ యాప్(Online game app) ద్వారా పరిచయం పెంచుకుని ఓ యువకుడి నుంచి కేటుగాడు ఏకంగా రూ.18 లక్షలు కాజేసిన ఘటన జడ్చర్ల మండలంలో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే..వల్లూరు గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఆన్లైన్ గేమ్ యాప్ (Online game app) ద్వారా గుర్తుతెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

దీంతో యువకుడిని నమ్మించి విడతలవారీగా రూ.18 లక్షలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పో యినందుకు ప్రభుత్వం ఇటీవల అందించిన పరిహారం సొమ్మును బాధిత యువకుడు ఆన్లైన్లో బదిలీ చేసినట్టు సమాచారం.అంతటితో ఆగకుండా ఇతరుల వద్ద అప్పులు తీసుకుని మరీ డబ్బులు చెల్లించినట్టు తెలిసింది.

బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్నాడు జిల్లా కోసూరు మండలం దొడ్లేరుకు చెందిన తమ్మిశెట్టి నాగార్జునను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం. నిందితునుంచి రూ.6 లక్షలు రికవరీ చేసినట్టు సమాచారం. నిందితుడు ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైం దని సీఐ కమలాకర్ తెలిపారు.

మరిన్ని వార్తలు