5 September, 2026 | 7:11 AM

ఓటరుకు సవరణ‘చిక్కు’లే!

05-09-2026 | 05:45am
  1. ఒక్క అక్షరం తప్పినా.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు 
  2. ఎస్‌ఐఆర్‌లో ఓటరు గోడు పట్టించుకునేదెవరు?

మహబూబాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఓటర్ల జాబితాను(voters lis) పకడ్బందీగా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(special comprehensive amendment,) (ఎస్ ఐ ఆర్) ఓటర్లకు(voters) మాత్రం సరికొత్త చిక్కులు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటు హక్కు(voting right) కోసం ఒక్కసారి నమోదు చేసుకున్న తర్వాత కూడా నివాసం మారినప్పుడు చిరునామా(addres) మార్చుకోవడం, పేరులో చిన్న అక్షర దోషాన్ని సరిచేయడం, తండ్రి/భర్త పేరులో(father/husband name) పొరపాటును సవరించడం, వయస్సు లేదా ఇంటి నంబర్లో మార్పులు చేయించుకోవడం వంటి సాధారణ పనులకు సైతం ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

షిఫ్టింగ్, చిన్న చిన్న తప్పులతో ముసాయిడా ఓటర్ల జాబితా నుండి తొలగించిన ఓటర్లకు సవరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 16 వరకు ఎస్ ఐ ఆర్ సవరణ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్ కు కనీసం 40 నుంచి 200 వరకు ఓట్లు ఇలా చిన్నచిన్న లోపాలతో సవరణ జాబితాలో చేరిపోయినట్లు చెబుతున్నారు. 

ఇల్లు మారింది.. ఓటు మారలేదు!

ఉద్యోగం, వ్యాపారం, వివాహం, పిల్లల చదువులు.. కారణం ఏదైనా కావచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకోవడం సాధారణమే. కానీ నివాసం మారిన వెంటనే ఓటరు జాబితాలో చిరునామా మారడం మాత్రం అంత సులభంగా జరగడం లేదని పలువురు వాపోతున్నారు. పాత ప్రాంతంలోని ఓటు వివరాలు, కొత్త ప్రాంతంలోని చిరునామా, పోలింగ్ కేంద్రం తదితర అంశాలపై స్పష్టత లేకపోవడంతో కొందరు ఓటర్లు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

ఒకే ఇంట్లో.. ఓట్లు వేర్వేరు చోట్ల!

షిఫ్టింగ్ ప్రక్రియలో మరో సమస్య కుటుంబాలను వేధిస్తోంది. ఒకే కుటుంబంలోని సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండాల్సి ఉండగా.. కొన్నిసార్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలు లేదా వేర్వేరు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు. భార్యాభర్తలు ఒకచోట.. పిల్లల పేర్లు మరోచోట.. తల్లిదండ్రుల పేర్లు ఇంకోచోట కనిపిస్తే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవు. ఇలాంటి వివరాలను ముందుగానే సరిచేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని ప్రజలు కోరుతున్నారు.

పేరు ఒక్కటే.. కానీ స్పెల్లింగ్ వేరు

‘రవి’కి ‘రవి కుమార్’.. ‘లక్ష్మి’కి ‘లక్ష్మీ’!

ఓటరు జాబితాలో చిన్న అక్షర దోషాలు సాధారణంగా కనిపించే సమస్య. పేరు ఒక అక్షరం తేడాగా ఉండటం, ఇంటిపేరు తప్పుగా నమోదవడం, తండ్రి పేరు లేదా భర్త పేరు తప్పుగా ఉండటం, వయస్సులో ఒకటి రెండు సంవత్సరాల తేడా ఉండటం వంటి వాటిని సవరించుకోవడానికి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి చిన్న పొరపాట్లు ఓటరుకు పెద్ద సమస్యగా మారకూడదని ప్రజలు కోరుతున్నారు. ఆధార్, ఓటరు కార్డు, ఇతర ప్రభుత్వ పత్రాల్లో ఒకే విధమైన వివరాలు ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో మాత్రం తేడా ఉంటే దాన్ని సులభంగా సరిచేసే వ్యవస్థ అవసరమని అంటున్నారు.

చిన్న తప్పు.. పెద్ద తిప్పలు!

ఓటరు జాబితాలో ఇంటి నంబర్ తప్పుగా ఉండటం, వీధి పేరు మారడం, గ్రామం/వార్డు వివరాల్లో పొరపాట్లు రావడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఒకసారి నమోదు చేసిన వివరాల్లో చిన్న తప్పు ఉంటే దాన్ని సరిచేయడానికి ఎవరిని సంప్రదించాలి? ఏ ఫారం వేయాలి? ఏ పత్రాలు ఇవ్వాలి? అనే విషయంలో సామాన్య ఓటర్లకు పూర్తి అవగాహన లేకపోవడం సమస్యను మరింత పెంచుతోంది.

వృద్ధులకు మరింత అవస్థలు

డిజిటల్ విధానంలో సవరణలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన ఉండదు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. స్మార్ట్ఫోన్ వినియోగం తెలియని వారు చిన్నపాటి సవరణ కోసం కూడా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత దాని ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకోవడం కూడా కొందరికి సమస్యగానే మారుతోంది.

బీఎల్‌వోల చుట్టూ.. కార్యాలయాల చుట్టూ

ఓటర్ల సమస్యలను పరిష్కరించడంలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాల పరిశీలన, షిఫ్టింగ్, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర పనులు చేపట్టాల్సి రావడంతో వారిపైనా పని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఓటరు సమస్యకు వెంటనే పరిష్కారం లభించకపోతే మళ్లీ మళ్లీ అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘ఓటు’ కోసం ఇంత తిప్పలా?

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు. అర్హత ఉన్న ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండటం ఎంత ముఖ్యమో.. అతని వివరాలు కచ్చితంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఎస్ ఐ ఆర్ ద్వారా ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం స్వాగతించదగిన చర్యే అయినప్పటికీ.. సవరణల కోసం వచ్చే అర్హులైన ఓటర్లకు ప్రక్రియ సులభంగా ఉండాలని చెబుతున్నారు. ఒక్క అక్షరం తప్పిందని.. ఒక్క చిరునామా మారిందని.. ఓటరు రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండకూడదని ప్రజలు కోరుతున్నారు. ఓటరు సమస్యను ‘ఫారం’తో కాకుండా పరిష్కారంతో చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

బాధ్యత ఎవరిది?

ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం అధికారులు క్షేత్రస్థాయిలో మరింత స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఓటు హక్కు కోసం ప్రజలు పరుగులు తీయడం కాదు.. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వ్యవస్థ మెరుగుపరచాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు