5 September, 2026 | 9:40 AM

అసెంబ్లీపైనే బీఆర్‌ఎస్ గురి

05-09-2026 | 05:25am

సర్కారును ఇబ్బందిపెట్టే వ్యూహాలకు పదును

6న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ భేటీ

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సభ్యులకు దిశానిర్దేశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Legislative Assembly Sessions) సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్(BRS) ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పార్టీ అధినేత కేసీఆర్(KCR) నాయకత్వంలో వ్యూహాలు పదునెక్కుతున్నాయి.

ప్రధానంగా కాంగ్రెస్  వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలపై గులాబీ పార్టీ గురి పెట్టనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు సెప్టెంబర్ 6న ఎర్రవల్లిలో సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు అందరు సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆరో తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, రైతుల పరిస్థితి వంటి అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం బరాజ్‌ల పరిస్థితి, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల మరమ్మతులు, వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. వ్యవసాయం, రైతు భరోసా, రైతు సంక్షేమ పథకాలు, ఇతర హామీలతో పాటు విద్యారంగ సమస్యలను టార్గెట్ చేసే అవకాశం ఉంది.

పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన అంశాలతో పాటు విద్యా రంగంలో ప్రభుత్వ విధానాలు, యువతకు సంబంధించిన సమస్యలు కూడా అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, సంక్షేమ పథకాలు తదితర అంశాల్లో ప్రభుత్వ పురోగతిపై లెక్కలు అడిగేలా వ్యూహం రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఇటీవల చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలు, పోలీసుల వ్యవహారశైలి వంటి అంశాలను కూడా సభలో ప్రస్తావించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలతో పాటు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలను సమన్వయంతో సభలో ప్రస్తావించాలని కేసీఆర్ పార్టీ సభ్యులకు సూచించే అవకాశం ఉంది. మొత్తంగా సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు సెప్టెంబర్ 6న ఎర్రవల్లి కేంద్రంగా ప్రభుత్వంపై సమరానికి బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది.   

మరిన్ని వార్తలు