5 September, 2026 | 7:12 AM

సురేఖ బర్తరఫ్ బాధాకరమే

05-09-2026 | 05:05am
  1. ఆమె తీరు ఆక్షేపణీయంగా ఉండటంతోనే చర్యలు 
  2. పార్టీలోనే ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తాం 
  3. పార్టీలో ఎవరు హద్దులు దాటినా చర్యలు తప్పవు 
  4. మంత్రివర్గ విస్తరణలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం 
  5. గెలిచినోళ్లందరికీ మంత్రి పదవులు సాధ్యం కాదు 
  6. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయం 
  7. పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడం బాధాకరమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Telangana PCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఆమె వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉండటం వల్ల అధిష్ఠానం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని, అదేవిధంగా క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటుందని వెల్లడించారు.

శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారని, పార్టీలో ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. కొండా సురేఖ గురువారం రోజు ఆవేదనగా, ఆవేశంతో మాట్లాడారని, ఇకపై అలా మాట్లాడకూడదని సూచించినట్లు చెప్పారు. పార్టీలో ఎవరికైఆ ఇబ్బందులుంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడికి చెప్పుకోవచ్చని, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌తో పాటు పార్టీ పెద్దలను కలుసుకునే అవకాశం ఉందన్నారు.

ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాత్రం పార్టీ సహించదని, కొండా సురేఖ విషయంలో హైకమాండ్ అదే సంకేతం ఇచ్చిందని మహేష్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు హద్దులు దాటి మాట్లాడినే ఇలాంటి చర్యలే ఉంటాయన్నారు. సురేఖ విషయంలో గతంలో రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డితో తాను మాట్లాడినట్లుగా చెప్పారు. ఇప్పుడు పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరించినందుకు పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు అవకాశం ఇస్తుందని, క్రమశిక్షణ విషయంలోనూ కుల, మతాలకతీతంగా చర్యలు ఉంటాయన్నారు. క్యాబినెట్ విస్తరణలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గెలిచిన వాళ్లందరికీ మంత్రి పదవులు కష్టసాధ్యమని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్ఠానం నిర్ణయంపై వేచిచూడాల్సిందేనని చెప్పారు.  రానున్న ఎన్నికల కోసం సీనియర్లందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు దాటుతామన్నారు. 

ప్రతిపక్ష హోదాకు అర్థముందా?

అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం కాకుండా అసెంబ్లీకి రావాలని, లేదంటే ప్రతిపక్ష హోదా పదవికి అర్థం లేకుండా పోతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ నెత్తిన అప్పులు పెట్టినా ప్రజల సంక్షేమం, అభివఋద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు