పండుగలకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి
- దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి
- నమ్మకమైన ఇరుగుపొరుగు వారికి సమాచారం
- జిల్లా ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం : బతుకమ్మ, దసరా పండుగలను(Bathukamma and Dasara festivals) ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి(Mahabubnagar District SP D. Janaki) కోరారు. పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దొంగతనాల నివారణకు(Prevention of thefts) ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు నగదు, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో(Bank lockers) భద్రపరచుకోవాలని తెలిపారు. ఇంటి ప్రధాన ద్వారాలతో పాటు వెనుక ద్వారాలు, కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని, ప్రయాణ వివరాలను సామాజిక మాధ్యమాల్లో(social media) వెల్లడించకూడదని హెచ్చరించారు. నమ్మకమైన ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి ఇంటి పరిసరాలపై నిఘా ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పేర్కొన్నారు.
వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి భద్రతా పరికరాలు వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పండుగల సమయంలో ప్రజల భద్రతకు జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని ఎస్పీ తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం:
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659360
పోలీస్ అత్యవసర సేవలు: 112