ఎందుకీ కడుపుమంట!

14-11-2026 | 05:20am
  1. బీజేపీ ద్వంద్వ వైఖరి: సీఎం
  2. భారత్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ వస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు..
  3. మోదీ ఏది చేసినా కరెక్టు.. రాహుల్ చేస్తే తప్పా  
  4. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కిషన్‌రెడ్డి, సంజయ్, కేటీఆర్ యత్నం
  5. నేటి నుంచి గిగ్ వర్కర్స్ చట్టం అమల్లోకి.. 
  6. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పాల్గొనడంపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబి స్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొనడాన్ని స్వాగతించిన బీజేపీ.. రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సీఎం ప్రశ్నించారు.

శుక్రవారం ఆయన ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారత్ సమ్మిట్‌ను ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ గిగ్ వర్కర్స్ చట్టం శనివారం నుంచి అమలులోకి వస్తుందని, దీనిని రాహుల్ గాంధీ  ప్రారంభిస్తారని సీఎం వెల్లడించారు. గిగ్ కార్మికులను రక్షించడం, వారికి సామాజిక భద్రత కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో, ఈ రంగానికి కేంద్రం తగినంత మద్దతు ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చర్చలు అవసరమన్నారు.

భారత్ సమ్మిట్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండీ సంజ య్‌ని కూడా ఆహ్వానించినప్పటికీ.. వారు హాజరుకాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్ బిహారీ వాజపేయిని దేశ ప్రతినిధిగా విదేశాలకు పంపిన సందర్భాన్ని సీఎం గుర్తుచేశారు.

భారత్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడంపై కొందరికి కడుపుమంటగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్ నినో సంబంధిత సమస్యలపై చర్చించడానికి ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి కూడా దూరంగా ఉన్నారని, తెలంగాణ పట్ల వారికున్న నిబద్ధత ఏంటో ఆర్థమవుతున్నదని ఆయన విమర్శించారు. ప్రజల ప్రయో జనాల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని, దాని యోగ్యతతో సంబంధం లేకుండా బీజే పీ, బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తున్నాయని సీఎం ఆరోపించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం లేదని, తెలంగాణ ప్రజ లను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఆత్మ వంటిదని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి మోదీ అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు విదే శాలకు వెళ్లుతుంటారని, మోదీ ఏది చేసినా కరెక్టు అవుతుందని, రాహుల్ చేస్తే తప్పు అన్నట్లుగా బీజేపీ వ్యవహారిస్తోందని సీఎం మండిపడ్డారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు.

రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే  బీజేపీ  భయపడుతోందని సీఎం తెలిపారు. రాజకీయ కారణాలతో రాహుల్ గాంధీ పర్యటన ను వ్యతిరేకించవద్దని ఆయన బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని 106 సార్లు మనం సవరించుకున్నామని, ప్రపంచ శాంతి కోసం చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారంతో రాహుల్ గాంధీ ప్రతిష్టను గానీ, పార్టీ స్థాయిని గానీ తగ్గించలేవ న్నారు. భారత్ సమ్మిట్‌లో ముగింపు సందేశాన్ని ఇచ్చేందుకు రాహుల్‌గాంధీ హైదరా బాద్ వస్తున్నారని తెలిపారు. 

తెలంగాణ బ్రాండ్‌కు రాయబారులు.. 

భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధులు తెలంగాణ బ్రాండ్‌కు రాయబారులుగా మారతారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తు న్న భారత్ భారత్ సమ్మిట్  తెలంగాణ పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి సామర్థ్యం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణా న్ని ప్రపంచానికి ప్రదర్శించడమే లక్ష్యమని అన్నారు. 70కి పైగా దేశాల నుంచి సుమా రు 1,000 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొదట కొంతమంది ఆహ్వానితులకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత దానిని ఉపసంహరిం చుకుందని ఆయన ఆరోపించారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత కూడా వెనక్కి వెళ్లా ల్సి వచ్చిందని సీఎం తెలిపారు. 

డిసెంబర్ 7,8, 9 తేదీలలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ప్రభుత్వం సన్నా హాలు చేస్తోందన్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు నిర్వహించగా, ముంబై, అహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ, బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు.


మరిన్ని వార్తలు