బీఆర్‌ఎస్ X కాంగ్రెస్

27-11-2026 | 05:35am
  1. రెండు లక్షల ఉద్యోగాల హామీపై బావర్చి హోటల్‌లో బీఆర్‌ఎస్ నిరసన 
  2. రాహుల్‌గాంధీ చిత్రపటానికి బిర్యానీ తినిపిస్తూ ఆందోళన
  3. అనుచరులతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ యాదవ్ 
  4. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
  5. ఇరువర్గాల బాహాబాహి, ఫర్నిచర్ ధ్వంసం
  6. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి

హైదరాబాద్/ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ అమలు కాలేదంటూ బీఆర్‌ఎస్ నేతలు(BRS leaders) గురువారం రాత్రి చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ నేత కృశాంక్ ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ చిత్రపటాన్ని తీసుకొచ్చి, బిర్యానీ తినిపిస్తు నిరసన నిర్వహించారు. గతంలో నిరుద్యోగ విద్యార్థులతో కలిసి ఇదే బావర్చి హోటల్‌లో రాహుల్‌గాంధీ డిన్నర్ చేసిన సందర్భంగా ఉద్యోగాల హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ యాదవ్ తమ అనుచరులతో బావర్చి హోటల్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో పాటు కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు దిగడంతో హోటల్‌లో ఫర్నిచర్ ధ్వంసమైంది. బీఆర్‌ఎస్ నేత కృశాంక్ మీద కూడా దా డి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు. హోటల్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: కేటీఆర్

ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు. ఈ దాడికి స్వయంగా ఒక రాజ్యసభ సభ్యుడే నాయకత్వం వహించి తన అనుచరులతో దాడులు చేయించడం మరింత దుర్మార్గమని ఆరోపించారు. దాడి చేసిన వారితో పాటు దానికి నాయకత్వం వహించిన వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్య హననం: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

ఉదయం రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ డ్రామా చేసి, సాయంత్రం బవార్చి హోటల్‌లో బీఆర్‌ఎస్ నాయకుల మీద దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అతని గూండాల గ్యాంగ్ దాడికి పాల్పడిందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. పోలీసులు అంతా తెలిసి అడ్డుకోకపోవడం, హింసను ప్రేరేపించడమే తప్ప మరోటి కాదన్నారు. పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్య హననం అయిందని విమర్శించారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని, లేదంటే వారు కూడా నేరస్తులుగా మిగులుతారని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు