నిరుద్యోగులకు శుభవార్త

27-11-2026 | 05:35am
  1. త్వరలో మరో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు
  2. అదనంగా 2వేల హోంగార్డు పోస్టులు
  3. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ద్రోహం
  4. బీఆర్‌ఎస్ ఇక గతమే.. రాష్ట్రంలో బీజేపీకి అధికారం కల్ల
  5. మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
  6. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం
  7. అచ్చంపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి 
  8. కొత్త పింఛన్లు, ఇందిరమ్మ చీరలు పంపిణీ

నాగర్‌కర్నూల్ / అచ్చంపేట, నవంబర్ 26 (విజయక్రాంతి): త్వరలో మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, లక్ష ఉద్యోగాల నియామక లక్ష్యాన్ని పూర్తిచేస్తామని నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భరోసా ఇచ్చారు. అదనంగా 2వేల హోంగార్డు పోస్టులు కూడా భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం మూడేండ్లలో రైతుల కోసం రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని, కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు చీరలు, కుటుంబ జీవిత బీమా వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నామని ఆయన వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్, బీజేపీ విడివిడిగా కాకుండా కలిసి రావాలని.. అసెంబ్లీలో వాళ్ల లెక్క తేలుస్తామని ఆయన సవాల్ విసిరారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం అచ్చంపేట వై జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కొత్త పింఛన్లను, ఇందిరమ్మ చీరల పంపిణీని పారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

కృష్ణా జలాల్లో కేసీఆర్ మోసం

‘గడ్డం పెంచుకున్న ప్రతీ అడ్డగాడిద రేవంత్‌రెడ్డి కాలేరు’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నది. అధికారం కోల్పోయిన కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌస్‌కు పరిమితమైండు. ఆయన ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ గతమే. దానికి భవిష్యత్తు లేదు’ అని విమర్శించారు. ‘పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు.

ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే రూ.8.11 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారు. పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అచ్చంపేట లిఫ్ట్ పూర్తిచేసి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని సంతకాలు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం నీళ్లు తీసుకునే అవకాశం కల్పించారు. 

పాలమూరు, అచ్చంపేట, డిండి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే ఈ ప్రాంతానికి నీటి కష్టాలు ఉండేవి కాదు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుంటే నాడు కేసీఆర్ ఏం చేశారు? పాలమూరు బిడ్డలను కృష్ణా జలాల విషయంలో ఆయన మోసం చేశారు’ అని సీఎం మండిపడ్డారు. ఈ ప్రాంతాన్ని కృష్ణా జలాలతో తడపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 

సొంత చెల్లికి చీర పెట్టలేని బీఆర్‌ఎస్

‘తోడబుట్టిన సొంత చెల్లెలికి కూడా చీర పెట్టలేని వారు మహిళల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరం’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం గత ఏడాది పాలపిట్ట రంగు చీరలు పంపిణీ చేసిందని, ఈసారి అచ్చంపేట వేదికగా చిలకపచ్చ రంగు చీరలు అందిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు. మహిళల సంక్షేమం విషయంలో తమకు, బీఆర్‌ఎస్‌కు మధ్య పులికి, నక్కకు ఉన్నంత తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అచ్చంపేటను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరుతున్నారని, అయితే తానే ఈ గడ్డపై పుట్టిన బిడ్డనని సీఎం అన్నారు. ‘నా రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఉమామహేశ్వరం, మద్దిమడుగు, సలేశ్వరం పుణ్యక్షేత్రాలు, నల్లమల అటవీ ప్రాంతం, చెంచు గిరిజనుల జీవన విధానం అచ్చంపేటకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అచ్చంపేట అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు తీసుకొచ్చాం’ అని వివరించారు. 

రాష్ట్రంలో బీజేపీకి అధికారం కల్ల

బండి సంజయ్, రాంచందర్‌రావు, కిషన్‌నెడ్డి ఎంత ప్రయత్నించినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ సభల్లో పల్లీలు, బటానీలు అమ్ముకోవడం తప్ప బీజేపీ చేసేదేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని, అసెంబ్లీలో వారి లెక్కలు తేలుస్తానని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని.. మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని పేర్కొన్నారు. 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్

సమాజానికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 16 ఎకరాలకు మరో నాలుగు ఎకరాలు సేకరించి మొత్తం 20 ఎకరాల్లో దేశానికే తలమానికంగా సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్‌గా లంబాడా సోదరుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. లంబాడాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాడతామని ఆయన చెప్పారు. 

మహిళల ఆత్మగౌరవమే లక్ష్యం: సీతక్క

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. అచ్చంపేట బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. అచ్చంపేట గడ్డ నుంచే రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చిలుకపచ్చ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,89,233 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తామని, ఎక్కడైనా అర్హుల పేర్లు మిస్సయితే పరిశీలించి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 నుంచి 2023 మధ్య 7.33 లక్షల పెన్షన్లు తొలగించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తూ అర్హులకు పెన్షన్లు కొనసాగిస్తోందన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా ఇప్పటివరకు రూ.75 వేల కోట్లకు పైగా రుణాలు అందించినట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని చేపట్టామని సీతక్క తెలిపారు. 

ప్రసంగం ప్రారంభంలోనే వెనుదిరిగిన జనం

అచ్చంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికే పెద్ద సంఖ్యలో ప్రజలు వెనుదిరగడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం నుంచే సీఎం రాక కోసం వేచి ఉన్న జనం.. సాయంత్రం చీకటి పడటంతో ఒక్కొక్కరుగా సభా ప్రాంగణం నుంచి వెనుదిరిగారు. ఇందిరమ్మ చీరలు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 500కు పైగా బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, జనానికి స్థానిక నేతలు తగిన సౌకర్యాలు కల్పించలేదన్న విమర్శలు ఉన్నాయి. రాత్రి ఏడు గంటల సమయంలో సీఎం ప్రసంగం ప్రారంభమయ్యే నాటికే వందల మంది తమ బస్సుల్లోకి చేరి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో సీఎం ప్రసంగం ప్రారంభంలోనే సభా ప్రాంగణంలో జనసందోహం పలుచపడటంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. 

మరిన్ని వార్తలు