కాంగ్రెస్‌ది గాంధీవాదం.. బీజేపీది గాడ్సే వారసత్వం
- మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీపై సీఎం రేవంత్ ఆగ్రహం
- ఓట్ చోరీతో నాల్గోసారి పవర్ కోసం మోదీ ప్లాన్
- గాంధీ వాదంతో కాంగ్రెస్.. గాడ్సే వారసత్వంతో బీజేపీ
- గాంధీ పక్షాన నిలిచి.. మోదీ కౌరవ సైన్యాన్ని ఓడిద్దాం
- రాజ్యాంగంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడుదాం
- రాష్ట్రంలో 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యం
- హైదరాబాద్‌లో చేపట్టిన పీసీసీ ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ప్రసంగం
- ఏక వ్యక్తి పాలన కోసం బీజేపీ ప్రయత్నాలు: డిప్యూటీ సీఎం భట్టి
- 13 ఏండ్ల నుంచి ఇబ్బందుల్లో రాజ్యాంగం: కాంగ్రెస్ ఇన్చార్జి బీఎం సందీప్
- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): అమెరికాకు 360 ఏండ్ల క్రితమే స్వాతంత్య్రం వచ్చినా చాలా ఏండ్ల వరకు కూడా అక్కడ మహిళలకు ఓటు హక్కు దక్కలేదని.. అదే మన దేశంలో మాత్రం అన్నివర్గాలకు ఓటు హక్కు కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. నాడు మహిళలకు ఓటు హక్కు వద్దని బీజేపీ నాయకులు వాదించారని.. అంబేద్కర్ మాత్రం అందరికీ కల్పించారని పేర్కొన్నారు.
ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తున్నదని.. ఇప్పటికే దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 7 కోట్ల ఓట్లను తీసేసే ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ, నల్ల డబ్బు తెస్తామంటూ మోసపూరిత హామీలతో 2014లో మోదీ అధికారంలోకి వచ్చారని.. ఆ తర్వాత కులమత భేదాలు, తప్పుడు హామీలతో రెండోసారి, మూడోసారి అధికారంలోకి వచ్చారని.. ఓట్ చోరీతో నాల్గోసారి పవర్లోకి రావాలని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ అనే దుష్ట చతుష్టయం కుట్ర పన్నుతున్నదని దుయ్యబట్టారు.
రాజ్యాంగంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమాన్ని పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్డు వరకు చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇప్పటి వరకు ఎవరు పాలకులుగా ఉండాలో రాజ్యాంగం నిర్ణయించిందని.. దురదృష్టవశాత్తు ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నారని ఆయన అన్నారు.
90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు..!
‘అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఇది. కానీ, కొందరు అధికారం శాశ్వతం చేసుకోవాలని రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. ఎందరో తమ ప్రాణ త్యాగాలతో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఇప్పుడు రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని, కుట్రను మనం తిప్పికొట్టాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాలు చేశారని.. దేశ రక్షణ కోసం గాంధీ వాదంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.
గాడ్సే వారసత్వంతో మోదీ ముఠా పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. ‘గతంలో రాజులు చనిపోతే, వాళ్ల కొడుకులు, తమ్ముళ్లు అధికారం పొందేవారు. కానీ పాలన ప్రజల చేతుల్లో పెట్టాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేద్కర్ ఆలోచించి రాజ్యాంగాన్ని అందించారు. గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారు. మేమంతా ప్రజలకు సేవకులం. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం, దేవుని ఆశీర్వాదంతో ఈ వేదికపై ఉన్నాను’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సాధించాలని, సమాన అవకాశాలను అందించాలని 1885లో కాంగ్రెస్ ఏర్పడిందని.. యుద్ధాలు, హింస లేకుండా అహింసతో స్వాతంత్య్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు.
‘మనం గాంధీ కుటుంబం పక్షాన నిలవాలి. గాంధీ పక్షాన నిలిచి.. మోదీ కౌరవ సైన్యాన్ని ఓడించాలి. స్వాతంత్య్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్. అధికారం కోసం పుట్టిన పార్టీ బీజేపీ. వందేండ్ల క్రితం కాంగ్రెస్ ఉంది.. ఇప్పుడూ ఉంది.. మరో వందేండ్లూ ఉంటుంది. బీజేపీ నాడు లేదు రేపు ఉంటుందో లేదో తెలియదు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఏక వ్యక్తి పాలన కోసం బీజేపీ కుట్రలు: భట్టి
భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పౌరుడి హక్కులను కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించి.. ప్రజలే తమ ప్రభుత్వాలను ఎన్నుకునే గొప్ప అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని వివరించారు.
నేడు సామాన్య ప్రజలు సమాన హక్కులను అనుభవిస్తున్నారంటే అందుకు రాజ్యాంగమే పునాది అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం మరింత పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి, దాని అమలును బలహీనపరిచి, ఏకవ్యక్తి పాలన ద్వారా నిరంకుశ విధానాలను తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఖర్గే, రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఇబ్బందుల్లో రాజ్యాంగం: బీఎం సందీప్
13 ఏండ్ల నుంచి దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బీఎం సందీప్ అన్నారు. ‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు. ఇక్కడ జై కాంగ్రెస్ అంటే నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వినిపించాలి’ అని సంవిధాన్ రక్షా మార్చ్‌లో ఆ యన పిలుపునిచ్చారు. సత్య, అహింస మా ర్గంలో దేశం సిద్ధించిందని, విశ్వంలోనే భారత్ చరిత్ర గొప్పదని పేర్కొన్నారు. ‘సమాన హక్కులను భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది. దేశ చరిత్ర.. కాంగ్రెస్ చరిత్ర ఒకటే. దేశ రా జ్యాంగం.. కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే’ అని తెలిపారు. లాల్ బహుదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అంటే.. మోదీ మాత్రం రైతులను చంపేస్తున్నారని ఈ సందరర్భంగా ఆయన దుయ్యబట్టారు.
- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
- అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు..
- హాజరైన పార్టీ ఇన్చార్జ్ సందీప్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన సాగింది. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ బీఎం సందీప్ కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ముందుగా లిబర్టీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించాక ర్యాలీని మొదలుపెట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించగా, అక్కడ ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ అందరిని ఆకర్షించింది. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో 1927 నాటి బ్రిటిష్ కమిషన్‌కు వ్యతిరేకిస్తూ నినదించిన ‘ సమైన్ గో బ్యాక్ ’ తరహాలో , ప్రస్తుతతం 2026 పరిస్థితితలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ‘ జ్ఞానేష్ గో బ్యాక్ ’ నినాదాన్ని హైలెట్ చేస్తూ ఈ బ్యానర్‌ను రూపొందించారు.
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మహేశ్‌గౌడ్
రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. దేశంలో జరుగుతున్న అప్రజాస్వామిక కుట్రలను ఎండగట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముందుకు సాగుతున్నదని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమని ఆయన సంవిధాన్ రక్షా మార్చ్ లో పేర్కొన్నారు.