డి3 కాలువ పూడికతీత పనులు పూర్తి చేయాలి
మిగిలిన 6 కిలోమీటర్ల పనులకు నిధులు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి):చోర్పల్లి గ్రామ పంచాయతీ(Chorpalli Gram Panchayat) పరిధిలో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఆడ ప్రాజెక్టు డి3 కాలువ(Ada Project D3 Canal) పూడికతీత పనులను పూర్తి చేయాలని రైతులు కోరారు. గురువారం ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిట్ల నారాయణ ఆధ్వర్యంలో రైతులు నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ డి3 కాలువ పూడికతీతకు గతంలో 12 కిలోమీటర్ల మేర పనులు మంజూరైనా గుండి గ్రామం వద్ద పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. చోర్పల్లి గ్రామ పంచాయతీ సరిహద్దుల వరకు మరో 6 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉందన్నారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మిగిలిన పనులకు వెంటనే నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు మిట్ట లచన్న, మిట్ట రాజన్న, నారా ఆశన్న, సైధం మహేష్, సాయి శైలం, మిట్ట చంద్రశేఖర్, గజ్జల రాజేష్, మిట్టె పోశన్న, టకిరె పాలక్‌రావు, గౌత్రే గురుమూర్తి, మిట్ట వెంకటేష్, పెద్దపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.