భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి

09-09-2026 | 06:58pm

ఎర్రుపాలెం సెప్టెంబర్ 9( విజయ క్రాంతి): భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని తాటిగూడెం రెవిన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఏఎంసి చైర్మన్ బండారు నరసింహారావుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్‌ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, హద్దులను గుర్తిస్తున్న ప్రక్రియను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించి, వాటిని సంబంధిత భూ రికార్డులతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాటిగూడెం రెవిన్యూ పరిధిలో మొత్తం 660 ఎకరాల్లో రీ-సర్వే చేపట్టాల్సి ఉండగా, ప్రస్తుతం సర్వే నంబర్లు 17 నుంచి 21 వరకు 35 ఎకరాల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారులు జాయింట్ కలెక్టర్‌కు వివరించారు.

ప్రతి భూ యజమానికి సంబంధించిన భూమి హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులతో సరిపోల్చాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సర్వేలో ఎలాంటి జాప్యం లేకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని స్పష్టం చేశారు.రీ-సర్వే సందర్భంగా రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర అందుబాటులో ఉన్న భూ రికార్డులను సర్వే అధికారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. క్షేత్రస్థాయిలో తమ భూముల వాస్తవ హద్దులను సర్వే బృందాలకు చూపించి సహకరించాలని సూచించారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

 తాటిగూడెం అనంతరం రాజుపాలెం రెవిన్యూ పరిధిలోనూ రీ-సర్వే నిర్వహించాలని రైతులు జాయింట్ కలెక్టర్‌ను కోరారు. తాటిగూడెం, రాజుపాలెం రెవిన్యూ గ్రామాల్లో రైతుల భూములు పక్కపక్కనే సరిహద్దుల్లో ఉన్నందున ఈ ప్రాంతంలోనూ సర్వే చేపడితే భూ హద్దులు స్పష్టమవుతాయని వివరించారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ తాటిగూడెం రీ-సర్వే పూర్తికాగానే రాజుపాలెం రెవిన్యూలో రీ-సర్వే కొనసాగేలా నోటిఫికేషన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

రీ-సర్వే పూర్తయిన అనంతరం భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలు మరింత స్పష్టంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని శ్రీనివాసరెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ వెన్నపూస వెంకటరెడ్డి, సర్వేయర్ కె. రాజశేఖర్, జీపీవోలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రవి, రైతులు వెన్నపూస నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, బూసుపల్లి శ్రీనివాసరెడ్డి, రాంబాబురెడ్డి, యన్నం పిచ్చిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు