యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి.రాజశేఖర్
జగిత్యాల, నవంబర్ 05 ( విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్ర సాధన(Telangana State Achievement) కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఆశయ సాధనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు(Employment opportunities for youth) కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి యువత ముందుకు వచ్చి ఉద్యమించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి.రాజశేఖర్ పిలుపునిచ్చారు.
ఈరోజు కొడిమ్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ 47 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగిందని అన్నారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన 1126 మంది అమరుల ఆశయాలను ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చకపోగా, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని ఆయన విమర్శించారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయక, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయక యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం వల్ల యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ ప్రభుత్వం గడిచిన 13 సంవత్సరాల కాలంలో 50 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర అజయ్, కొడిమ్యాల మండల నాయకులు గజ్జి మహేష్, పులి తిరుపతి, పులి మనోజ్, బి. హరీష్, మూడపెళ్లి రాము, తదితరులు పాల్గొన్నారు.