విమానంలోనూ ఆగని వైద్య సేవలు
తోటిప్రయాణికుడికి డాక్టర్ మట్టా దయానంద్ తక్షణ వైద్య సహాయం.
సత్తుపల్లి. నవంబర్ 2. ( విజయ క్రాంతి ): ఇండిగో విమానంలో(IndiGo aircraft) అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి వైద్యం.. అభినందించిన తోటి ప్రయాణికులు ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో(Congress Party protest program) పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఇబ్బందులు పడటాన్ని గమనించిన డాక్టర్ దయానంద్ వెంటనే స్పందించారు.
వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు ప్రయాణికుడికి తక్షణ వైద్య సేవలు అందించారు. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విమాన సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఢిల్లీలో రాజకీయ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నప్పటికీ, తోటి ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని గమనించి వెంటనే వైద్య సహాయం అందించడం ఆయన మానవతా దృక్పథానికి, వృత్తిపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
ఈ సంఘటనను గమనించిన విమానంలోని తోటి ప్రయాణికులు డాక్టర్ మట్టా దయానంద్ తక్షణ స్పందనను, సేవాభావాన్ని అభినందించారు. ప్రజా జీవితంలో ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన సమయంలో వైద్యుడిగా తన బాధ్యతను నిర్వర్తించిన ఆయనపై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.