ఆ ఘనత మాదే..!
- జాతీయ రహదారి క్రెడిట్ కోసం పార్టీల గోల
- నాయకుల మధ్యమాటల తూటాలు
- హాట్ టాపిక్‌గా కరీంనగర్-వరంగల్ రోడ్డు
కరీంనగర్, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): జగిత్యాల-కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారి(Jagtial-Karimnagar-Warangal National Highway) ఘనత మాదంటే మాదే అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) లు ప్రకటించుకుంటుండటం హాట్ టాపిక్ గా మారింది. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్-563) నాలుగు వరుసల విస్తరణ పనుల క్రెడిట్ విషయంలో తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పార్టీల నేతల మధ్య రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది.
కరీంనగర్-వరంగల్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో పార్రంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తామే మంజూరు చేయించామని, దీని వెనుక తమ శ్రమ ఉందంటూ బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, వినోద్ కుమార్ ల మధ్య క్రెడిట్ వార్ సాగుతోంది. కరీంనగర్ ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఘనతే అని స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పదే పదే చర్చలు జరిపి నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించానని ఆయన పేర్కొంటున్నారు. కరీంనగర్-వరంగల్ హైవే పనులు పూర్తయ్యాయి, త్వరలోనే జగిత్యాల-కరీంనగర్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని బండి సంజయ్ పేర్కొంటున్నారు. ఎంపీగా ఉన్నప్పుడే పోరాటం చేశామని రాష్ట్ర బి సి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటున్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని, ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పలుమార్లు లేఖలు రాసి డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
లేఖలకు స్పందిస్తూ 2016 మే 24న అధికారికంగా లేఖ జారీ చేసిందని, ఈ మార్గాన్ని మార్చి 2014లోనే ఎన్ హెచ్-563గా ప్రకటించారని, సుమారు 130 కిలోమీటర్ల మేర 4-లేన్ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ఎన్ హెచ్ ఏ ఐ కి అప్పగించినట్లు నాటి కేంద్ర కార్యదర్శి సంజయ్ మిత్ర ఆ లేఖలో పేర్కొన్నారని ప్రకటించారు. కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఈ జాతీయ రహదారికి బీజం పడింది తాము అధికారంలో ఉన్నప్పుడే అని గుర్తు చేస్తున్నారు.
2014-2019 మధ్య కాలంలో తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడే ఈ రోడ్డును జాతీయ రహదారిగా నోటిఫై చేయించడంలో, భారత్మాల పరియోజన కింద దాదాపు 2,146 కోట్ల బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో ఢిల్లీ స్థాయిలో తాను స్వయంగా ఒత్తిడి తెచ్చానని ఆయన చెప్తున్నారు. ఆ సమయంలో భూసేకరణకు సంబంధించిన సమీక్షలు కూడా తానే నిర్వహించానని వినోద్ కుమార్ అంటున్నారు.