పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి
ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలందించాలి..
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Goush Alam) శనివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పోలీసుల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు.
స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, కేసు ప్రాపర్టీ భద్రత, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల నిఘా కీలకమని, స్టేషన్ పరిధిలోని అన్ని కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
వినియోగంలో లేని పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.