బాలసదనం నూతన భవనాన్ని వెంటనే అందుబాటులోకి తేవాలి
కలెక్టర్ చిత్రా మిశ్రా
ముకరంపుర,(విజయక్రాంతి): స్మార్ట్ సిటీ నిధులతో(Smart City funds) నిర్మించిన బాలసదనం నూతన భవనాన్ని(New Balasadan Opening) వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. భవనానికి కాంపౌండ్ వాల్, విద్యుత్, తాగునీరు, ఇతర అవసరమైన మౌలిక వసతులను కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న బాలసదనం భవనాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ సందర్శించారు. బాలసదనం నిర్వహణ, అందుతున్న సేవలు, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న శిశుగృహ కేంద్రాన్ని పరిశీలించారు.పక్కనే ఉన్న నూతన భవనాన్ని పరిశీలించిన కలెక్టర్.. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నారులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.
చిన్నారుల దత్తతకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించారు.అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ఆయా కార్యాలయాల పనితీరు, చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సత్వరమే ఐడీఓసీ భవనంలోకి తరలించాలని ఆదేశించారు. చైల్డ్ ప్రొడక్షన్ వింగ్స్ ను కొత్త బాలసాధనం కేంద్రంలోకి తరలించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమ అధికారి ఏం. సరస్వతి, డీసీపీఓ పర్వీన్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.