విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

02-11-2026 | 11:14pm

ఎంఈఓ వెంకటరెడ్డి

నాగిరెడ్డిపేట,నవంబర్ 2 (విజయ క్రాంతి):మండలంలోని టి.జి.ఎమ్.ఎస్ మోడల్ స్కూల్(T.G.M.S Model School),గోపాల్‌పేట్లో మండల స్థాయి అండర్-14, అండర్-17 బాలుర, బాలికల కబడ్డీ జోనల్ జట్లు జిల్లా స్థాయి పోటీల కొరకు జోనల్ జట్ల ఎంపిక పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.ఈ ఎంపిక పోటీల్లో నాగారెడ్డిపేట,ఎల్లారెడ్డి, గాంధారి మండలాలకు చెందిన పాఠశాలల క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొని తమ కబడ్డీ నైపుణ్యాలను ప్రదర్శించారు.రాబోయే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే ఎల్లారెడ్డి జోనల్ జట్ల కొరకు అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి హాజరై పోటీలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని,ఇలాంటి పోటీలు వారి నైపుణ్యాలను వెలికితీయడానికి ఎంతో దోహదపడతాయనన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్, స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్, అన్ని మండలాల ఫిజికల్ డైరెక్టర్లు,పిటిలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు