ఎంఎస్ఎన్ ఫార్మాలో ప్రమాదం.. నలుగురికి గాయాలు
బిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూర్ మండల(Bikkanur Mandal) కేంద్రంలోని ఎంఎస్ఎన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్(MSN Pharma Pvt Ltd) యూనిట్-3లోని బ్లాక్-బీలో గురువారం ప్రమాదం జరిగినట్లు సమాచారం. రియాక్టర్లో రసాయనాలు కలుపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిలో ఇద్దరు కార్మికులు, కెమిస్టులు, బ్లాక్ ఇన్చార్జ్ ఉన్నట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ యాజమాన్యం, అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగిందని కొందరు, మధ్యాహ్నం జరిగిందని మరికొందరు స్థానికంగా చర్చించుకుంటున్నారు.ఇలాంటి ఘటనకు సంబంధించిన వివరాలు కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే కంపెనీలో 2026 జూన్ 13న రియాక్టర్ లీకేజీ జరిగి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు నిర్వహించారని స్థానికంగా చర్చమశానియంగా మారింది. వరుస ప్రమాదాల నేపథ్యంలో కార్మికుల భద్రతపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.