స్మశానవాటికల పరిశుభ్రతకు ప్రాధాన్యం
పొదలను తలఁగింపు ముమ్మరంగా చేపడుతున్నాం
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం
స్మశానవాటికలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలి
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): స్మశానవాటికల పరిశుభ్రత(Cemetery Cleanliness)కు ప్రాధాన్యతనిచ్చి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్(Municipal Corporation Mayor Mood Ganesh) అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ 24వ డివిజన్ పరిధిలోని స్మశానవాటికలో గురువారం ఆయన స్వయంగా పర్యటించి, అక్కడ పేరుకుపోయిన పిచ్చిచెట్లు, ముళ్లపొదల తొలగింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అంత్యక్రియల సమయంలో అవస్థలు పడకుండా స్మశానవాటికలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. స్మశానవాటికలో పెరిగిన కంపచెట్లను పూర్తిగా తొలగించి, మార్గాలు సాఫీగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.