అధికారులకు సీఎం డెడ్‌లైన్
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్(Telangana Global Summit)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. సమ్మిట్‌కు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా లైజనింగ్ అధికారులను నియమించాలని, అతిథుల రిజిస్ట్రేషన్, పాస్‌ల జారీ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితో పాటు భద్రతా అధికారిని కూడా నియమించాలని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రముఖులు, ప్రతినిధుల రాక నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌ను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఉపయోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, రాష్ట్ర సంస్కృతి, ప్రత్యేకతలను సమ్మిట్‌లో ప్రదర్శించాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్న వాతావరణ మార్పుల అంశంపై సమ్మిట్‌లో విస్తృత చర్చ జరిగేలా కార్యక్రమాలను రూపొందించాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
అలాగే నర్సరీ స్థాయి నుంచి ఆక్స్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థల స్థాయి వరకు విద్యారంగంలో వస్తున్న మార్పులు, తెలంగాణ విద్యా వ్యవస్థ అభివృద్ధి వంటి అంశాలు ప్రతిబింబించేలా చర్చలు నిర్వహించాలని సూచించారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. నవంబర్ 15లోగా ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని గడువు విధించారు. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో విజయవంతం చేయడంతో పాటు తెలంగాణ పర్యాటకం, విద్య, అభివృద్ధి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.