అక్రమ అరెస్టులకు భయపడేది లేదు...

27-10-2026 | 06:30pm
  1. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం...
  2. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఎర్రవట్టి...

బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో(Banswada Constituency) మంగళవారం మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఎర్రవట్టి తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సాయిబాబా ఎర్రవట్టి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు.

అరెస్టులు, నిర్బంధాలతో బీఆర్ఎస్ నాయకులను భయపెట్టలేరని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఈ అరెస్టుల్లో బీఆర్ఎస్ నాయకులు బాడీ శ్రీనివాస్, మొగులయ్య శ్రీనివాస్, జాదవ్ ఈశ్వర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు